- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పనిలోనే ఎక్కువ సమయం గడుపుతున్న భారతీయులు

- సెల్ఫ్ కేర్‌ను మర్చిపోతున్న ఇండియన్స్
- ఉద్యోగ, ఉపాధి కార్యకలాపాలకే మొగ్గు
- టైమ్ యూజ్ సర్వేలో సంచలన విషయాల వెల్లడి
దిశ, నేషనల్ బ్యూరో: 2024లో భారతీయులు పనిలోనే ఎక్కువ సమయం గడిపారని.. స్వీయ సంరక్షణ, నిర్వహణ కోసం సమయం తక్కువగా కేటాయించినట్లు ఒక సర్వేలో తేలింది. కేంద్ర ప్రభుత్వం తాజా విడుదల చేసిన 'టైమ్ యూజ్' సర్వేలో భారతీయుల టైమ్ మేనేజ్‌మెంట్‌పై అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 15 నుంచి 59 ఏళ్ల వయసున్న స్త్రీ, పురుషులు ఉద్యోగం, ఉపాధి సంబంధిత కార్యకలాపాల్లో వరుసగా 75 శాతం, 25 శాతం మేర సమయాన్ని కేటాయించారు. 2019లో ఇది 70.9, 21.8 శాతంగా మాత్రమే ఉంది. మరోవైపు భారతీయులు తమ స్వీయ సంరక్షణ, నిర్వహణ కోసం గడిపే సమయం గత ఐదేళ్లలో రెండు శాతం తగ్గినట్లు సర్వేలో తెలిసింది. 2019లో తొలి సారిగా ఈ సర్వే నిర్వహించినప్పుడు ఇండియన్స్ ఏ విధంగా తమ సమయాన్ని వినియోగిస్తున్నారనే దానిపై లోతుగా అధ్యయనం చేశారు. అప్పట్లో స్త్రీ, పురుషులు పెయిడ్, అన్‌పెయిడ్ యాక్టివిటీస్‌లో ఏ విధంగా సమయాన్ని వినియోగిస్తున్నారని తెలుసుకున్నారు. ఇందులో ఎలాంటి చెల్లింపులు చేయని ఇంటి పనులు, సంరక్షణ బాధ్యతలు, స్వచ్ఛంధ సేవా కార్యక్రమాలు, శిక్షణ వంటివి కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇక తాజాగా గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో ఆరు ఏళ్ల కంటే పైబడి.. 1.39 లక్షల గృహాల్లో ఉంటున్న 4.45 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించారు. ఈ సర్వేలో ఆరేళ్లకు పైబడిన పురుషులు 2,28,576 మంది, మహిళలు 2,25,565 మంది పాల్గొన్నారు.
ఉద్యోగం, ఉపాది, సొంత వస్తువుల తయారి, ఇంటి పనులు, ఇంటి సభ్యుల సంరక్షణ, జీతభత్యాలు లేని స్వచ్చంద సేవలు, శిక్షణ, ఇతర పనులు, అభ్యాసన, సోషలైజింగ, సంస్కృతి, స్వీయ సంరక్షణ తదిత అంశాల ప్రాతిపదికన ఈ సర్వేను నిర్వహించారు.
సర్వేలో కీలక అంశాలు
1. ఆరేళ్లకు పైబడిన 41 శాతం మంది భారతీయులు ఉపాధి సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నారు. 2019తో పోలిస్తే ఇది మూడు శాతం మేర పెరిగింది. ఇక ఒక్కో భారతీయులు సగటున రోజుకు 440 నిమిషాలు పని చేస్తున్నాడు. పురుషులు 473 నిమిషాలు పని చేస్తుండగా, మహిళలు 341 నిమిషాల మేర పని చేస్తున్నారు.
2. ఇంటి పనుల కోసం సగటున 129 నిమిషాలు కేటాయిస్తున్నారు. 2019తో పోలిస్తే రెండు శాతం తగ్గింది. ఇక మహిళలు రోజుకు 289 నిమిషాలు ఇంటి పనులు చేస్తుండగా.. పురుషులు కేవలం 88 నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నారు.
3. ఇంటి సభ్యుల సంరక్షణ కోసం పురుషులు రోజుకు 75 నిమిషాలు కేటాయిస్తుండగా.. మహిళలు 137 నిమిషాలు కేటాయిస్తున్నారు.
4. 6 నుంచి 14 ఏళ్ల వయస్సున్న 89.3 శాతం మంది పిల్లలు లెర్నింగ్ యాక్టివిటీస్‌లో ఉంటున్నారు. వారు రోజంతా కలిపి దాదాపు 413 నిమిషాలు ఇలాంటి కార్యకలాపాల కోసమే వినియోగిస్తున్నారు.
5. ఆరేళ్లకు పైబడిన వారు రోజుకు సగటున 171 నిమిషాలు సంస్కృతి, మాస్ మీడియా సంబంధిత కార్యకలాపాల్లో లేదా విశ్రాంతి కోసం వినియోగిస్తున్నారు. ఇలాంటి యాక్టివిటీస్‌లో పురుషులు 177 నిమిషాలు, మహిళలు 164 నిమిషాలు కేటాయిస్తున్నారు.
6. ఇక నలుగురితో కలవడం, మాట్లాడటం, కమ్యూనిటీ పార్టిసిపేషన్, మత సంబంధిత విషయాల కోసం 2019లో 130 నిమిషాలు కేటాయించగా.. 2024లో అది 125 నిమిషాలకు తగ్గిపోయింది.
7. 2019లో 15-59 ఏళ్ల వయసు ఉన్న మహిళలు ఎలాంటి జీతభత్యాలు లేని ఇంటి కార్యకలాపాల కోసం 315 నిమిషాలు కేటాయించారు. కానీ 2024కు వచ్చే సరికి ఆ సమయం 305 నిమిషాలకు తగ్గింది.
8. గ్రామీణ జనాభాలో 15-59 వయస్సు గల వారిలో 24.6 శాతం మంది తమ సొంత అవసరాల కోసం ఉపయోగించే వస్తువుల కోసం రోజుకు 121 నిమిషాలు కేటాయించారు.
9. స్వీయ సంరక్షణ, నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల కోసం ఆరేళ్లు పైబడిన వాళ్లు సగటున 708 నిమిషాలు కేటాయిస్తున్నారు.
10. పురుషుల కంటే మహిళలు ఇంటి పనుల కోసం 201 నిమిషాలు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అంతే కాకుండా కుటుంబ సభ్యుల సంరక్షణ కోసం 62 నిమిషాలు అధికంగా మహిళలే పని చేస్తున్నారు.
11. ఉద్యోగం, ఉపాధి సంబంధిత కార్యకలాపాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని వారి కంటే అర్బన్ ప్రాంతాల ప్రజలు 73 నిమిషాలు ఎక్కువగా పని చేస్తున్నారు.
12. సొంత వినియోగం కోసం వస్తువులను ఉత్పత్తి చేసుకునే విషయంలో అర్బన్ ప్రాంతాల వారి కంటే రూరల్ ప్రాంత ప్రజలు 59 నిమిషాలు ఎక్కువగా గడుపుతున్నారు.