Indian Railways: అందుబాటులోకి 'సూపర్' యాప్‌.. ఆ సమస్యలకు చెక్!

by D.Reddy |   ( Updated:2025-02-01 02:52:08.0  )
Indian Railways: అందుబాటులోకి సూపర్ యాప్‌.. ఆ సమస్యలకు చెక్!
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైలు ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు రైల్వేకు సంబంధించిన వివిధ సర్వీసుల కోసం వేర్వేరు యాప్‌లను, వెబ్ సైట్లను వినియోగించాల్సి వస్తుంది. ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్‌ (Online Ticket Booking) కోసం IRCTC, అన్‌ రిజర్వుడు టికెట్ల కోసం UTS, ఫుడ్‌ ఆర్డర్‌ కోసం IRCTC e- Catering, ఫిర్యాదులు, ఫీడ్‌ బ్యాక్‌ (FeedBack) కోసం రైల్‌ మదద్‌ వంటివి ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కోదానికి కోసం ఒక్కో యాప్ ఉపయోగించాల్సి రావటంతో రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకపై ఈ సమస్యకు చెక్ పెడుతూ ఇండియన్ రైల్వే సూపర్ యాప్ 'స్వరైల్'ను (SwaRail) అందుబాటులోకి తీసుకొచ్చింది.

రైల్వేకు సంబంధించిన ఈ స్వరైల్ యాప్‌ను సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (CRIS) అభివృద్ధి చేసింది. ఇందులో టికెట్ బుకింగ్, లైవ్ లొకేషన్, PNR స్టేటస్, ట్రాకింగ్ సిస్టమ్, ఫుడ్ ఆర్డర్ వంటి వేర్వేరుగా ఉన్న సేవలన్నీ ఒకే చోట పొందవచ్చు. ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. అయితే, టెస్టింగ్ పూర్తి అయినా తర్వాత ప్రజలకు ఈ యాప్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం చాలామంది ప్రయాణికులు ట్రైన్ లైవ్ లోకేషన్, ఫీడ్ బ్యాక్ వంటి వివిధ రకాల సేవల కోసం థర్డ్‌ పార్టీ యాప్‌లపై ఆధారపడుతున్నారు. దీంతో సెక్యూరీటిపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక ఈ యాప్ అందుబాటులోకి వస్తే రైల్వే ప్రయాణికులకు ఈ సమస్య తీరి, అన్ని రకాల సదుపాయాలు ఈజీ కానున్నాయి. అంతేకాదు, ఈ యాప్ లాగిన్ చేయడం కూడా చాలా సులభం. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, విభిన్న లాగిన్ ఎంపికలు అందించారు. ఒకసారి లాగిన్ అయిన తర్వాత, యాప్‌ని తర్వాత mPIN లేదా బయోమెట్రిక్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు.


Next Story

Most Viewed