'సంభవ్' ఫోన్‌తోనే చైనాతో సరిహద్దు చర్చలు.. ఇండియన్ ఆర్మీ కోసమే తయారీ

by John Kora |
సంభవ్ ఫోన్‌తోనే చైనాతో సరిహద్దు చర్చలు.. ఇండియన్ ఆర్మీ కోసమే తయారీ
X

- ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా పటిష్టమైన భద్రత

- వెల్లడించిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

దిశ, నేషనల్ బ్యూరో:

నిరుడు అక్టోబర్ నెలలో చైనాతో సరిహద్దు వివాదంపై జరిపిన చివరి దశ చర్చల కోసం 'సంభవ్' స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించారు. ఇప్పుడు అవే ఫోన్లను ఆర్మీలోని అధికారులు అందరికీ ఇవ్వనున్నారు. సురక్షితమైన కమ్యునికేషన్ కోసం సంభవ్ (సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వెర్షన్) ఫోన్లను ఉపయోగించినట్లు ఆర్మీ చీఫ్ జనగర్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఆర్మీకి సంబంధించిన వార్షిక నివేదికను ఆయన శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 30 వేల సంభవ్ ఫోన్లను ఆర్మీ అధికారులకు ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. క్లిష్టమైన, గోప్యత కలిగిన సమాచారాన్ని పంచుకోవడానికి ఈ సంభవ్ ఫోన్లలో ఆర్మీ కోసమే రూపొందించిన సెక్యూర్డ్ అప్లికేషన్లు ఉన్నాయని చెప్పారు.

ఆర్మీకే ప్రత్యేకం ఎం-సిగ్మా

సంభవ్ ఫోన్లలో ఆర్మీ కోసమే రూపొందించిన ఎం-సిగ్మా అనే అప్లికేషన్ ఉంటుంది. వాట్సప్ లాగానే ఎం-సిగ్మా ఉపయోగించి సందేశాలు పంపించుకోవచ్చు. అలాగే డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలు అత్యంత భద్రంగా షేర్ చేసుకునే వీలుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లను ఎయిర్‌టెల్, జియో వంటి మొబైల్ నెట్‌వర్క్‌లో ఉపయోగించినా.. డేటా లీకేజీ లేకుండా అరికడుతుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన అనేక మంది అధికారులు వాట్సప్‌తో పాటు ఇతర మెసేజింగ్ సర్వీసులను వాడుతున్నారు. దీని వల్ల అత్యంత సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అవుతోంది. అందుకే ఆర్మీ కోసమే ప్రత్యేకంగా ఎం-సిగ్మాను రూపొందించారు. ఇక ఈ ఫోన్‌లో అనేక ముఖ్యమైన విభాగాలకు సంబంధించిన నంబర్లు నిక్షిప్తం చేయబడి ఉంటాయి. ఆర్మీ అధికారులు ప్రత్యేకంగా నంబర్లను సేవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎండ్ టూ ఎండ్ సెక్యూర్ మొబైల్ ఎకో సిస్టమ్‌ను ఆర్మీ కోసం ఇండియాలోనే రూపొందించడం గమనార్హం. ఇది అత్యంత భద్రత కలిగిన కమ్యునికేషన్‌ను తక్షణ కనెక్టివిటీతో అందించనుంది.

Advertisement
Next Story