ఎలక్టోరల్ బాండ్ల మార్గదర్శకాల సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరించిన ఎస్‌బీఐ

by S Gopi |
ఎలక్టోరల్ బాండ్ల మార్గదర్శకాల సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరించిన ఎస్‌బీఐ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎలక్టోబ్రల్ బాండ్ల పథకాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసిన నేపథ్యంలో బాండ్ల విక్రయాలకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్ఓపీ) వివరాలను వెల్లడించడానికి ఎస్‌బీఐ నిరాకరించింది. ఈ పథకం కింద రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను ఎన్నికల సంఘం(ఈసీ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల బాండ్ల విక్రయాలు, ఎన్‌క్యాష్ కోసం తమ బ్రాంచులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) జారీ చేసిన ఎస్ఓపీ వివరాలు చెప్పాలని హక్కుల కార్యకర్త అంజలి భరద్వాజ్ సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి బదులిచ్చిన ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం కన్నబాబు.. అది తమ అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుంది. వాణిజ్య, వ్యాపార రహస్యాలు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సమాచారాన్ని బహిర్గతం చేయకుండా చట్ట ప్రకారం మినహాయింపు ఉందని పేర్కొంది. అయితే, ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ స్కీమ్‌కు సంబంధించిన అన్ని వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ, ఎస్‌బీఐ మాత్రం కీలక సమాచారాన్ని బయటకు చెప్పడంలేదని అంజలి భరద్వాజ్ ఆరోపణలు చేశారు. ఎస్ఓపీ ద్వారా ఎన్నికల బాండ్ల విక్రయాలు, ఎన్‌క్యాష్‌పై బ్యాంకు చేసిన ఆదేశాల వివరాలు తెలుస్తాయని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Next Story