UGC : వార్షిక పరీక్షల స్థానంలో సెమిస్టర్‌ విధానం.. యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్

by Hajipasha |
UGC : వార్షిక పరీక్షల స్థానంలో సెమిస్టర్‌ విధానం.. యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్
X

దిశ, నేషనల్ బ్యూరో : 2035 నాటికి దేశంలోని 50 శాతం యూనివర్సిటీలు, కాలేజీల్లో నూతన జాతీయ విద్యా విధానాన్ని (NEP 2020) అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఛైర్మన్ ఎం.జగదీశ్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే దేశంలోని 21 శాతం కాలేజీల్లో ఈ విద్యా విధానం అమలవుతోందన్నారు. యూనివర్సల్‌ సెమిస్టర్‌ విధానాన్ని(Semester System) అమలు చేసేందుకుగానూ కాలేజీలు, వర్సిటీల్లో వార్షిక పరీక్షల విధానాన్ని తొలగించాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న దేవి అహల్య యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగిన జోనల్ కాన్ఫరెన్స్‌‌లో ఎం.జగదీశ్ కుమార్ ప్రసంగించారు. సెమిస్టర్ పరీక్షల విధానం వల్ల విద్యార్థులు నిర్ణీత వ్యవధిలో తమ అభ్యసన ఫలితాలను బేరీజు వేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. తద్వారా అప్పటివరకు ఎంత నేర్చుకున్నారో స్పష్టంగా తెలిసిపోతుందన్నారు. ‘‘ఒకే విద్యా సంవత్సరంలో రెండు అకడమిక్ కోర్సులను చేయడానికి అనుమతించాలని ఎన్‌ఈపీ-2020 చెబుతోంది. దీనిపై మేం యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసి రెండేళ్లు దాటింది. అయినా ఇప్పటికీ అనేక వర్సిటీలు విద్యార్థులకు ఆ సౌకర్యాన్ని అందించడం లేదు’’ అని యూజీసీ సెక్రటరీ మనీశ్ ఆర్.జోషి తెలిపారు.

‘యూజీసీ’ సవరణ బిల్లులో విప్లవాత్మక ప్రతిపాదనలు

డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు, విద్యా సంవత్సరాలకు సంబంధించి విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సమాయత్తం అవుతోంది. ‘యూజీసీ (యూజీ, పీజీ డిగ్రీల) రెగ్యులేషన్స్ - 2024’ సవరణ బిల్లులో ఇందుకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను పొందుపరిచారు. జాతీయ స్థాయిలో నిర్వహించే సంబంధిత పరీక్షలో పాసయ్యే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ కోర్సులో చేరొచ్చనే నిబంధన ముసాయిదా బిల్లులో ఉందని తెలుస్తోంది. అమెరికా విద్యా వ్యవస్థ తరహాలో ఏడాదిలో రెండుసార్లు(జులై/ఆగస్టు, జనవరి/ఫిబ్రవరి) డిగ్రీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించాలనే నిబంధన సైతం ఉందని సమాచారం. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేేలా యూజీ, పీజీ కోర్సుల పరీక్షల షెడ్యూళ్లు ఉండాలని బిల్లులో ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల వ్యవధిని పెంచడం, తగ్గించడం వంటి నిబంధనలు కూడా ఉన్నట్లు తెలిసింది. సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసిన తర్వాత అందులోని నిబంధనలన్నీ అమల్లోకి వస్తాయి.

Advertisement

Next Story