Omar Abdullah : నితీశ్‌కు ‘ఇండియా’ పగ్గాలిస్తే మాతోనే ఉండేవారు : సీఎం ఒమర్ అబ్దుల్లా

by Hajipasha |   ( Updated:2024-12-14 13:08:46.0  )
Omar Abdullah : నితీశ్‌కు ‘ఇండియా’ పగ్గాలిస్తే మాతోనే ఉండేవారు : సీఎం ఒమర్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇండియా కూటమి(INDIA bloc) సారథిగా నితీశ్ కుమార్‌(Nitish Kumar)ను నియమించి ఉంటే.. ఆయన ఇప్పటికీ తమతోనే ఉండేవారని జమ్మూకశ్మీర్ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) అన్నారు. లోక్‌సభ ఎన్నికల టైంలో నితీశ్‌ను ఇండియా కూటమి కన్వీనర్‌ చేసే అంశంపై చర్చ జరిగిందని.. అయితే కొందరు అందుకు నో చెప్పారన్నారు. నితీశ్‌కు విపక్ష కూటమి పగ్గాలిచ్చే ప్రతిపాదనను పలు పార్టీలు వ్యతిరేకించాయని ఆయన పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక చర్చల విషయానికొస్తే.. మన దేశం కంటే పొరుగుదేశం పాకిస్తాన్‌పైనే ఎక్కువ బాధ్యత ఉందన్నారు. భారతదేశ ఆందోళనలను నివృతి చేసే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్‌పై ఉందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారులు, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికీ పాకిస్తానే అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘మనం స్నేహితులను మార్చేయొచ్చు. కానీ పొరుగు దేశాలను మార్చేయలేమని మాజీ ప్రధాని వాజ్‌పేయి తరుచుగా చెబుతుండేవారు. పాకిస్తాన్ మన పొరుగుదేశం. అదే నిజం’’ అని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ‘‘పాకిస్తాన్ కబ్జాలో ఉన్న కశ్మీరు భూభాగాన్ని భారత్ వెనక్కి తీసుకోవాలని మేం కూడా కోరుకుంటున్నాం. అయితే అందుకు యుద్ధం ఒక్కటే పరిష్కారం కాదు. చర్చలు జరగాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి.. లెఫ్టినెంట్ గవర్నర్‌, సీఎంల రూపంలో ఏర్పడిన రెండు అధికార కేంద్రాల ఫార్ములాకు తెరదించాలి’’ అని ఒమర్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed