Ashwini Vaishnaw: అవసరమైతే ధర్నా చేయండి.. కాంగ్రెసం ఎంపీకి రైల్వేమంత్రి సూచన

by Shamantha N |
Ashwini Vaishnaw: అవసరమైతే ధర్నా చేయండి.. కాంగ్రెసం ఎంపీకి రైల్వేమంత్రి సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: తిరువనంతపురంలో రైల్వే ప్రాజెక్టు కోసం అవసరమైతే ధర్నా చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) కు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) సూచించారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో శశిథరూర్ తన సొంత నియోజకవర్గమైన తిరువనంతపురం నమోమ్ రైల్వే టెర్మినల్ ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం, నిధుల కేటాయింపు గురించి అడిగారు. దీనిపైనే అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. అయితే, కేరళలో నిధుల సమస్య కాదని, ఇప్పటికే భూసేకరణ కోసం రూ.2,150 కోట్లు డిపాజిట్‌ చేసినట్లు మంత్రి వెల్లడించారు. అవసరమైతే భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందు ధర్నాకు కూర్చోవాలని థరూర్‌ని రైల్వేమంత్రి తెలిపారు. ప్లాన్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తయ్యేలా భూ సేకరణ కోసం రైల్వేలకు సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేయాలని కోరారు.

50 ఏళ్లలో అవసరాలను తీర్చేలా..

పెద్ద పెద్ద సిటీలు, జంక్షన్లలో రద్దీని తగ్గించేందుకు కొత్త టర్మినల్స్ నిర్మాణంపై కేంద్రం దృష్టి పెట్టిందన్నారు. రాబోయే 50 ఏళ్లలో అవసరాలు తీర్చేలా డిజైన్లు రూపకల్పన చేస్తుందన్నారు. అంతేకాకుండా రైళ్లకు కొత్త జనరల్ బోగీలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.‘‘ఫస్ట్‌ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్‌ ఏసీ బోగీలపై కాకుండా జనరల్‌ కోచ్‌లపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టాం. డిసెంబర్‌ నెలాఖరు నాటికి 1000 జనరల్‌ కోచ్‌లను రైల్వే నెట్‌ వర్క్‌లకు జత చేస్తాం. 10వేల జనరల్‌ కోచ్‌ల తయారీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీం కింద 1300 రైల్వే స్టేషన్లను మళ్లీ నిర్మిస్తున్నాం. కొన్నింటిని ఆధునికీకరిస్తున్నాం. ఈ ప్రాజెక్టు కింద అనేక రైల్వే స్టేషన్లను రూ.700 - 800 కోట్లతో, మరికొన్ని రూ.100- రూ.200 కోట్లతో తిరిగి నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. రైల్వే స్టేషన్లు మరింతగా మెరుగుపడాలన్న ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి’’ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed