Hyperloop: 30 నిమిషాల్లో 300 కిలోమీటర్ల ప్రయాణం.. భారత తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తి

by vinod kumar |
Hyperloop: 30 నిమిషాల్లో 300 కిలోమీటర్ల ప్రయాణం.. భారత తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశపు మొట్టమొదటి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ (Hyperloop Test track) సిద్ధమైంది. 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ సహాయంతో ఐఐటీ మద్రాస్ (IIT Madras) నిర్మించింది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే హై-స్పీడ్ రైలు గంటకు 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. అంటే ఢిల్లీ నుంచి జైపూర్‌కు 300 కిలోమీటర్లు ఉండగా అరగంటలోనూ ఈ ప్రయాణం పూర్తి చేయొచ్చు. అలాగే ఢిల్లీ నుంచి హరిద్వార్ వరకు దాదాపు 200 కిలోమీటర్ల ప్రయాణం 20 నిమిషాల్లో పూర్తి అవుతుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashvini vyshanaw) దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో రిలీజ్ చేశారు. ‘భవిష్యత్ రవాణాలో నూతన ఆవిష్కరణలను తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తుంది. ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో నిర్మించిన 422 మీటర్ల ఈ మొదటి పాడ్ హైపర్‌లూప్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఎంతో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు.

ఐఐటీ మద్రాస్‌కు ఒక్కొక్కదానికి ఒక మిలియన్ డాలర్ల చొప్పున రెండు గ్రాంట్లను అందజేశామని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి మూడోసారి గ్రాంట్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. కాగా, ఐదో రవాణా విధానంగా నిర్వచించబడిన హైపర్‌లూప్.. సుదూర ప్రయాణానికి అనువైన హై-స్పీడ్ రవాణా వ్యవస్థ. దీని వలన వాక్యూమ్ ట్యూబ్‌లలోని ప్రత్యేక క్యాప్సూల్స్ ద్వారా రైళ్లు చాలా ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. సముద్ర మట్టం వద్ద ఒక ప్రామాణిక రోజున మాక్ వేగం గంటకు 761 కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ సాంకేతికపై పరిశోధనలు చేస్తున్నారు.

Advertisement
Next Story

Most Viewed