- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జమ్ముకశ్మీర్ లో ఐదుగురు ముష్కరుల ఇళ్లు ధ్వంసం

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత భద్రతాబలగాలు ముష్కరుల వేట సాగిస్తున్నాయి. ఇందులో భాగంగానే లష్కరే తోయిబా ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న వారి కోసం తీవ్రంగా గాలస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి వాటిని ధ్వంసం చేసే పనిలో పడ్డాయి. శుక్రవారం రాత్రి జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా ఐదుగురు ముష్కరుల నివాసాలను పేల్చేశారు. షోపియన్, కుల్గామ్, పుల్వామా జిల్లాల్లో భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. షోపియాన్‌లోని చోటిపొరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి. గత మూడు, నాలుగు ఏళ్లుగా ఉగ్ర సంబంధిత కార్యకలాపాల్లో షాహిద్ చురుగ్గా పాల్గొంటున్నాడని అధికారులు వెల్లడించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలను సమన్వయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడని అధికారులు తెలిపారు.
కూల్చివేతలు
మరోవైపు, కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరో యాక్టివ్ టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ నివాసాన్ని ధ్వంసం చేశారు. ఇదే జిల్లాలో లష్కరేకు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశారు. 2023 జూన్ నుంచి ఇతడు దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించారు. 2023 నుండి యాక్టివ్ గా ఉన్న మరో ఉగ్రవాది హరిస్ అహ్మద్ నివాసం కూడా పుల్వామాలోని కాచిపోరా ప్రాంతంలో జరిగిన పేలుడులో ధ్వంసమైంది. కుల్గాంలోని ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది అహ్‌సన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చారు. అహ్‌సన్ 2018లో పాకిస్థాన్ వెళ్లి ఉగ్ర శిక్షణ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఇటీవలే కశ్మీర్ లోయలోకి తిరిగొచ్చి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిఘా ఏజెన్సీలు పేర్కొన్నాయి. కాగా.. పెహల్గాం దాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకడైన ఆదిల్ హుస్సేన్ థోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లు ఇప్పటికే నేలమట్టమయ్యాయి. ఇకపోతే, ఏప్రిల్ 22న పెహల్గాంలో పర్యాటకులపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది చనిపోయారు. కాగా..ఉగ్రవాదులను పట్టుకోవడానికి సైన్యం భారీ వేట ప్రారంభించింది. సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), జమ్ముకశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.