Gaza Ceasefire Deal : గాజా కాల్పుల విరమణ ఒప్పందంతో బందీల విడుదల

by Y. Venkata Narasimha Reddy |
Gaza Ceasefire Deal : గాజా కాల్పుల విరమణ ఒప్పందంతో బందీల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం(Gaza Ceasefire Deal) మేరకు బందీల అప్పగింత (Hostages Released)కొనసాగుతోంది. తాజాగా హమాస్ ఇజ్రాయెల్ కు చెందిన ఇద్దరు బందీలను విడుదల చేసింది. యార్డెన్ బిబాస్ (35), ఫ్రెంచ్-ఇజ్రాయెలీ ఓఫర్ కల్లెరోన్ (54) అనే ఇద్దరు బందీలను శనివారం విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిని హమాస్ రెడ్ క్రాస్ కు అప్పగించింది. కీత్ సీగెల్ (65) అనే మరో అమెరికన్-ఇజ్రాయెలీ వ్యక్తిని కూడా అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై దాడి సమయంలో హమాస్ వీరిని బంధించింది. ఇప్పటికే 8 మంది బందీలను గురువారం హమాస్ విడుదల చేయగా.. ఇందుకు ప్రతిగా 110మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. కాల్పుల విరమణ ప్రారంభమైన తొలిరోజు ముగ్గురు మహిళా బందీలను హమాస్.. వందకు పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. 42 రోజుల తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో తమ చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33 మందిని హమాస్ విడుదల చేయనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనీయులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించనుంది. హమాస్ వద్ద ఉన్న బందీలలో ఎనిమిది మంది మరణించినట్లు తమకు సమాచారం అందిందని ఇజ్రాయెల్ పేర్కొంది.

ఒక ఇజ్రాయెల్ బందీని హమాస్ విడుదల చేస్తే, 30 మంది పాలస్తీనీయుల్ని ఇజ్రాయెల్ విడుదల చేసేందుకు ఒప్పందం కుదిరింది. ముగ్గురు బందీలను గాజాలో శనివారం విడుదల చేయనున్నట్లు హమాస్‌ సాయుధ విభాగమైన ఖసమ్‌ బ్రిగేడ్స్‌ వెల్లడించింది. జైళ్లలో ఉన్న 90మంది పాలస్తీనియన్లను విడుదల చేయనున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రకటించిందని పాలస్తీనా ఖైదీల మీడియా కార్యాలయం తెలిపింది. ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య బీకర యుద్ధం చివరి దశలోనైనా కాల్పుల విరమన ఒప్పందం కుదరడంతో బందీల విడుదలతో బాధిత కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతున్నప్పటికి...యుద్ధంతో వలస వెళ్లి స్వస్థలాలకు చేరుకున్న వారు శిథిలాల కుప్పగా మారిన ఇళ్లను చూసి తమ భవిష్యత్ ఏంటో అర్థం కాక బోరుమంటున్నారు.

మరో వైపు సిరియా-లెబనాన్‌ సరిహద్దు పొడవునా బెకా వ్యాలీలో హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ మిలటరీ దాడులు చేసింది. ఇజ్రాయిల్‌, లెబనాన్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇజ్రాయిల్‌ పేర్కొంది. నవంబరు చివరిలో హిజ్బుల్లా, ఇజ్రాయిల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తొలుత జనవరి 26వరకే ఈ ఒప్పందం అమల్లో వుంటుందని ప్రకటించినా తర్వాత ఫిబ్రవరి 18వరకు పొడిగించారు. అప్పటి వరకు ఈ ఒప్పందం అమలవుతుందని అమెరికా కూడా గత ఆదివారం ధ్రువీకరించింది. ఆలోగా ఇజ్రాయిల్‌ బలగాలు లెబనాన్‌ నుండి ఉపసంహరించాల్సిందేనని లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్‌, ఈజిప్ట్‌ విదేశాంగ మంత్రి బాదర్‌కు స్పష్టం చేశారు. ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించినప్పటి నుండి లెబనాన్‌ గడ్డపై ఇజ్రాయిల్‌ పలు దాడులు జరిపింది. వందమందికి పైగా గాయపడ్డారు.



Next Story

Most Viewed