Rain Alert: ముంబై, పూణేలో భారీ వర్షాలు.. రోడ్లపై నడుములోతు నీళ్లు..

by Harish |   ( Updated:2024-07-25 09:14:04.0  )
Rain Alert: ముంబై, పూణేలో భారీ వర్షాలు.. రోడ్లపై నడుములోతు నీళ్లు..
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలో భారీగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ నగరం స్తంభించిపోయింది. నగరంలో కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. నడుము లోతు నీళ్లలో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. లోతట్టు ప్రాంతాల నివాసాలను నీళ్లు భారీగా చుట్టుముట్టాయి. సియోన్, చెంబూర్, అంధేరి వంటి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కొన్ని సబ్‌వేలు మొత్తం నీటితో నిండిపోయాయి. వరదల కారణంగా అంధేరి సబ్‌వే మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వరదలతో నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు నదుల్లో నీటి ప్రవాహం కూడా క్రమంగా పెరుగుతుంది. నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ఏడు సరస్సులలో రెండు మోదక్-సాగర్ సరస్సు, విహార్ సరస్సు పొంగిపొర్లుతున్నాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

మరోవైపు ప్రతికూల వాతావరణ నేపథ్యంలో ముంబైకి రావాల్సిన లేదా ఇక్కడి నుంచి వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని రద్దు చేశారు. ఇండిగో తన విమానాలు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది. అలాగే, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ కూడా విమానాల రాకపోకలు ప్రభావితం కావచ్చని హెచ్చరించింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా విమానాల స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది.

మరోవైపు పూణేలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాంతీయ వాతావరణ కేంద్రం పూణేకు 'రెడ్' అలర్ట్ జారీ చేసింది. నింబ్జానగర్ ప్రాంతంలో, చిక్కుకుపోయిన 70 మందిని అగ్నిమాపక శాఖ రక్షించింది. పూణే జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసే పౌరులు "జాగ్రత్తగా ఉండాలని, నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అవసరమైతే మాత్రమే బయటకు రావాలని" విజ్ఞప్తి చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉండాలని, అవసరమైన వారికి వెంటనే సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్న కారణంగా జిల్లా కలెక్టర్లతో ఆయన ఎప్పటికప్పుడు పరిస్థితుల గురించి వాకబు చేస్తున్నారు. మరింత సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీతో కూడా మాట్లాడింది. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సీఎం ప్రజలకు సూచించారు.

Advertisement

Next Story