PM Modi: జూట్, లూట్ నుంచి ఢిల్లీని విముక్తి చేయాలి- ఆప్ పై మోడీ విమర్శలు

by Shamantha N |
PM Modi: జూట్, లూట్ నుంచి ఢిల్లీని విముక్తి చేయాలి- ఆప్ పై మోడీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీని తప్పుడు హామీలు, అబద్ధాలు, దోపిడీల నుంచి విముక్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆమ్ ఆద్మీ పార్టీపై(AAP) విమర్శలు గుప్పించారు. "ఆప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కంటే ప్రకటనలకే ఖర్చు చేస్తోంది. వారు పేదలు, సామాన్యుల ప్రయోజనాలను పట్టించుకోరు. మనమందరం కలిసి ఢిల్లీని " జూట్" (అబద్ధాలు), "లూట్ "(దోపిడి) నుండి విముక్తి చేయాలి" అని అన్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆప్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దోపిడీకి పాల్పడిన వారిని జవాబుదారీ చేస్తామన్నారు. వారు తీసుకున్న వాటిని వెనక్కి రప్పిస్తామన్నారు. అసెంబ్లీ మొదటి సెషన్‌లోనే కాగ్ నివేదికను సమర్పిస్తామని.. అది ఆప్‌ ప్రభుత్వ కుంభకోణాలను బయటపెడుతుందని చెప్పుకొచ్చారు.

దేశ రాజధానిని ఏటీఎంలా మార్చింది

దేశాన్ని పాలించే అవకాశాన్ని తనకు ప్రజలు పలుమార్లు కల్పించారని, అలాగే ఢిల్లీని పరిపాలించే అవకాశాన్ని ఇవ్వాలని ఓటర్లను మోడీ కోరారు. తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఆమ్‌ ఆద్మీపార్టీ (AAP) దేశ రాజధానిని ఒక ఏటీఎంలా మార్చిందని విమర్శించారు. ఆప్(దా) ఢిల్లీ డబ్బును దోచుకుందని.. ఆ డబ్బుని వేరేచోట రాజకీయాలను విస్తరించేందుకు వాడుతోందని ఆరోపించారు. ‘‘నాకు సొంతిల్లు లేకపోయినా.. ప్రతి పేదవాడికి కాంక్రీట్ ఇల్లు ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని ఆప్‌ అడ్డుకుంటోంది. ఢిల్లీలో పేదల కోసం కేంద్రం నిర్మించిన ఇళ్లను ఆప్ కేటాయించడం లేదు. కోట్ల రూపాయలతో శీష్‌మహల్‌ను నిర్మించుకున్నవారికి పేదల బాధ ఏం అర్థం అవుతోంది? పేదల సొంతిటి కల నెరవేర్చుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి’’ అని మోడీ అన్నారు. ఆప్‌ అందరితో గొడవలు పెట్టుకోవడంలో బిజీగా ఉందని మండిపడ్డారు. యమునా నదిని విషపూరితం చేశారని అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మోడీ ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాగా..ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరగనుండగా.. 8న ఫలితాలు వెలువడనున్నాయి.


Next Story