West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత

by S Gopi |   ( Updated:2024-08-27 17:56:12.0  )
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత
X

దిశ, నేషనల్ బ్యూరో: ట్రెయినీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అట్టుడుకుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘం 'పశ్చిమ బంగా ఛాత్రో సమాజ్' మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. 'నబన్నా అభియాణ్' పేరుతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, వారందరినీ పోలీసులు అడ్డుకోవడంతో సంతర్ గాచి వద్ద ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. హౌరాలోని పశ్చిమ బెంగాల్ సచివాలయం నబన్నాకు ఒక విద్యార్థి సంస్థ మార్చ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఇది జరిగింది. ఆందోళనకారులు బారికేడ్లను ధ్వంసం చేయడంతో పాటు పోలీసులపై రాళ్లను రువ్వారు. దీంతో పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు. పరిస్థితులు అదుపుతప్పడంతో సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద భద్రతను పెంచారు. నబన్నా వైపు మార్చ్‌లో పాల్గొన్న వారిలో 103 మంది పురుషులు, 23 మంది మహిళలు సహా మొత్తం 126 మంది నిరసనకారులను కోల్‌కతా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో 15 మంది పోలీసులు గాయపడినట్టు సమాచారం. నబన్నా వద్దకు చేరుకున్న జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ, భాష్పవాయువు, వాటర్ క్యాన్‌లను ప్రయోగించారు. మరోవైపు పోలీసులపైకి దాడికి ప్రయత్నించిన నిరసనకారుల ఫోటోలను పోలీసు అధికారులు విడుదల చేశారు.

ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్త ర్యాలీలు చేపట్టిన విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనంగా బెంగాల్ బీజేపీ విభాగంలో బుధవారం 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సార్వత్రిక సమ్మె ఉంటుందని, ఇందులో పాల్గొనాలని బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ ప్రజలను కోరారు.

దీనిపై స్పందించిన బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ విద్యార్థుల పట్ల పోలీసుల తీరుపై మండిపడ్డారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని ప్రయోగిస్తోందన్నారు. 'శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై రాజ్యాధికారం ఉండదన్న సుప్రీంకోర్టు ప్రకటనను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి బలవంతపు చర్యలు తీసుకోవడం మంచిది కాదు. ఇది జాతీయ భావాలను, జెండాను, దేశం, బెంగాల్ ప్రజలను అవమానించడమేనని ' ఏఎన్ఐతో అన్నారు.

Advertisement

Next Story