Media: సైనిక కార్యకలాపాలకు సంబంధించి మీడియా రిపోర్టింగ్‌పై ప్రభుత్వం అడ్వైజరీ

by S Gopi |
Media: సైనిక కార్యకలాపాలకు సంబంధించి మీడియా రిపోర్టింగ్‌పై ప్రభుత్వం అడ్వైజరీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో దాయాది పాకిస్తాన్‌తో వైరం ముదురుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం చేపడుతున్న సైనిక కార్యకలాపాలు, భద్రతా బలగాల కదలికలకు సంబంధించి ప్రత్యక్ష పసారం అందించే విషయంలో అన్ని మీడియాలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వైజరీ విడుదల చేసింది. ఈ ఆదేశాలు వార్తా సంస్థలకే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా వాడుతున్న వారికి కూడా వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలను వివరించడంలో అత్యంత జాగ్రత్తగా, బాధ్యతతో నడుచుకోవాలని స్పష్టం చేసింది. సంబంధిత చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని తెలిపింది. విజువల్స్‌కు సంబంధించి, సున్నితమైన ప్రదేశాల నుంచి లైవ్ ఇవ్వడం, సైనిక చర్యలకు చెందిన సమాచారంలో మూలాలు చెప్పాయంటూ రిపోర్ట్ ఇవ్వడాన్ని ప్రభుత్వం నిషేధించింది. సున్నితమైన చర్యల వివరాలను ముందుగా వ్యాప్తి చేయడం వల్ల ప్రమాదానికి పరోక్షంగా దోహదం చేసిన వారవుతారని, అనుకున్న పనితో పాటు దాన్ని చేపట్టిన సిబ్బంది భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం వివరించింది. సంక్షోభ సమయాల్లో అపరిమిత మీడియా కవరేజీ వల్ల జాతీయ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.



Next Story