ఒకటో తరగతిలో ఉండాల్సిన చిన్నారుల కనీస వయసుపై కేంద్రం కీలక ఆదేశం..

by Vinod kumar |
ఒకటో తరగతిలో ఉండాల్సిన చిన్నారుల కనీస వయసుపై కేంద్రం కీలక ఆదేశం..
X

న్యూఢిల్లీ: ఒకటో తరగతిలో అడ్మిషన్ కోసం చిన్నారుల కనీస వయసును 6 ఏళ్లుగా నిర్ణయించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంగళవారం లేఖ రాసినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. నూతన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ) ప్రకారం.. ఫౌండేషన్ స్టేజ్‌‌లో పిల్లలందరికీ(3-8ఏళ్ల మధ్య) ఐదేళ్లపాటు నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. ఈ దశలో మూడేళ్ల ప్రీస్కూల్ విద్య, తర్వాత 1, 2 తరగతులు ఉంటాయి.

'ఈ విధానం ప్రీ-స్కూల్ నుండి 2వ తరగతి వరకు పిల్లల్లో నేర్చుకునే తత్వాన్ని అభివృద్ధి చేస్తుంది. అంగన్‌వాడీలు లేదా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, ఎన్జీవో నడిపే స్కూళ్లలో చదువుతున్న పిల్లలందరికీ మూడేళ్ల నాణ్యమైన ప్రీస్కూల్ విద్యను అందుబాటులో ఉంచడం ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది' అని విద్యా మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందాలంటే కనీస వయసు ఐదేళ్లుగా ఉన్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed