Google Maps: గూగుల్ మ్యాప్స్ వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయి- బీజేపీ ఎంపీ

by Shamantha N |
Google Maps: గూగుల్ మ్యాప్స్ వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయి- బీజేపీ ఎంపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ రాజ్యసభ ఎంపీ అజీత్ మాధవరావు గోప్చాడే గూగుల్ మ్యాప్స్ లోపాల గురించి పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్ మ్యాప్స్ లోపాల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ సమస్యల కోసం, స్వదేశీ మ్యాపింగ్ పరిష్కారాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. పార్లమెంటులో జీరో అవర్ సందర్భంగా అజీత్ మాధవరావు మాట్లాడారు. కేరళలోని పెరియార్ నదిలో కారు పడి ఇద్దరు యువ వైద్యులు మరణించారని గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఇలాంటి ప్రమాదం జరిగి ముగ్గురు గాయపడ్డారని ఉదహరించారు. "ఈ ఘటనలు గూగుల్ మ్యాప్స్‌లోని ఆదేశాలు ఎల్లప్పుడూ సరైనవి కావని హైలైట్ చేస్తాయి" అని ఆయన అన్నారు. భారతదేశ ప్రత్యేక మౌలిక సదుపాయాలు, రహదారి పరిస్థితులను పరిష్కరించే "స్వదేశీ" మ్యాపింగ్ వ్యవస్థను రూపొందించడానికి ఇస్రో సహా ఇతర సంస్థలతో సహకరించాలని స్టార్టప్ కంపెనీలకు పిలుపునిచ్చారు.

ఐటీ యాక్ట్..

అంతేకాకుండా, సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 43(ఎ)ని కూడా అజీత్ మాధవరావు ప్రస్తావించారు. ఇది డేటా భద్రత, కచ్చితత్వాన్ని నిర్ధారించడం తప్పనిసరి అని సంస్థలకు సూచింస్తుంది. గూగుల్ మ్యాప్స్ వంటి సంస్థలకు సాంకేతిక సామర్థ్యాలు ఉన్నాయి కానీ.. డేటా కచ్చితత్వం, భద్రతలో విఫలమయ్యాయని అన్నారు. ఈ యాక్ట్ ప్రకారం వారిని చట్టపరంగా బాధ్యులుగా చేయవచ్చని అన్నారు. గూగుల్ మ్యాప్స్ కూడా జవాబుదారీగా ఉండాలని ఎంపీ అన్నారు. మరోవైపు, నావిగేషన్ యాప్‌లను కేవలం గైడ్ గానే ఉపయోగించమని నిపుణులు సూచిస్తున్నారు. మార్గం అసురక్షితంగా కనిపిస్తే, డ్రైవర్లు ప్రధాన రహదారులనే ఎంచుకోవాలని సూచించారు. సమయాన్ని ఆదా చేయాలనే తొందరలో అనవసరమైన ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దంటున్నారు. ఇకపోతే, గతేడాది గూగుల్ మ్యాప్‌లను అనుసరించి గోవాకు ప్రయాణించాల్సిన బిహార్ రాష్ట్రానికి చెందిన కుటుంబం తప్పుడు నావిగేషన్ కారణంగా కర్ణాటకలోని భీమ్‌గడ్ అడవిలో చిక్కుకుపోయింది.

Next Story