ప్రభుత్వ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
ప్రభుత్వ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ సమయంలో భారతీయులు అందరూ ఐక్యంగా ఉండాలని ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (AICC Leader Rahul Gandhi) పిలుపునిచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terrorist Attack)లో గాయపడిన వారిని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ శ్రీనగర్ (Srinagar) వెళ్లారు. శ్రీనగర్ లో జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ (Jammu Kashmir Congress) కార్యకర్తలు, స్థానికులతో రాహుల్ సమావేశం అయ్యారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులపై నాయకులను ఆరా తీశారు. అలాగే జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (CM omar Abdullah) నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

అనంతరం అనంతనాగ్ జీఎంసీలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి పరామర్శించారు. వారికి అన్ని విధాల న్యాయం జరిగేలా పోరాడతామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ లో ఏం జరుగుతుందో తెలుసుకొని, వారికి సహాయం చేయడానికే ఇక్కడికి వచ్చామని తెలిపారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ ఈ భయంకర చర్యను ఖండించారని, వారు ఈ దేశానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఇక ఉగ్రదాడిలో గాయపడిన వారిలో ఒకరిని కలిశానని అన్నారు. ఇక ప్రతిపక్షల ఈ ఉగ్రచర్యను ఖండిస్తోందని, ప్రభుత్వం ఏ చర్య తీసుకోవాలనుకున్నా దానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

అంతేగాక ఈ సమయంలో భారతీయులు అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని, తద్వారా ఉగ్రవాదుల ప్రయత్నాలను తిప్పికొట్టగలమని చెప్పారు. ఇక కాశ్మీర్‌తో పాటు దేశం మొత్తం నుంచి ఉన్న నా అన్నదమ్ములు, అక్కాచెల్లెమ్మలపై కొంతమంది దాడులు చేస్తున్నారని చూసి ఎంతో బాధగా ఉందని, మనందరం ఐక్యంగా నిలబడి, ఈ దారుణమైన చర్యను ఎదుర్కొని, ఉగ్రవాదాన్ని ఒకేసారి పూర్తిగా ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తాను ముఖ్యమంత్రిని, లెఫ్టినెంట్ గవర్నర్‌ను కూడా కలిశానని, వారు జరిగిన విషయాలను తనతో వివరించారని తెలిపారు. వారిద్దరికి మా పార్టీ, మేము పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నామని తెలియజేశానని రాహుల్ గాంధీ వెల్లడించారు.



Next Story

Most Viewed