చిన్న ‘షటర్’ ఉన్న కంపెనీకి రూ. 1368 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు ఎవరిది కంపెనీ?

by Ramesh N |   ( Updated:2024-03-15 10:15:09.0  )
చిన్న ‘షటర్’ ఉన్న కంపెనీకి రూ. 1368 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు ఎవరిది కంపెనీ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ సమర్పించిన డేటాను ప్రజలకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 2019 నుంచి 2024 వరకు రాజకీయ పార్టీలకు అందిన విరాళాలు సగానికి సగం కేవలం 23 కంపెనీల నుంచే అందాయి. అందులో ‘ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌’ పేరు మారుమోగిపొతుంది. ఆ సంస్థ 2024 జనవరి వరకు అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువ చేసే ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ చిన్న ‘షటర్’ ఉన్న కంపెనీ రూ. 1368 కోట్లు వివిధ పార్టీలకు విరాళాలు ఇవ్వడం ఏమిటని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఫ్యూచర్‌ గేమింగ్ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ కంపెనీ యజమాని, లాటరీ కింగ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన శాంటియాగో మార్టిన్‌ది. ఈయననే అత్యధికంగా రూ.2,455.20 కోట్లను విరాళంగా ఇచ్చాడని తెలుస్తోంది. దేశంలో లాటరీ సేల్స్ లీగల్‌గా జరుగుతున్న 13 రాష్ట్రాల్లో మార్టిన్ బిజినెస్ చేస్తూ నిత్యం కోట్లు ఆర్జిస్తున్నారు. గతంలో ఫ్యూచర్‌ గేమింగ్ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఈడీ రైడ్స్ చేసింది. అప్పుడు దాదాపు రూ.603 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో ఆయన వార్తల్లో నిలిచారు. తాజాగా ఎలక్టోరల్ బాండ్ల విషయంలో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈయన అత్యధికంగా బీజేపీ పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు ఆరోపణలతో సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది.

Advertisement

Next Story