ఆగస్టు 15న జెండా ఎగరేస్తాం! జనవరి 26న ఆవిష్కరిస్తాం! తేడా ఏంటీ?

by D.Reddy |   ( Updated:2025-01-26 03:42:19.0  )
ఆగస్టు 15న జెండా ఎగరేస్తాం! జనవరి 26న ఆవిష్కరిస్తాం! తేడా ఏంటీ?
X

దిశ, వెబ్ డెస్క్: గణతంత్ర దినోత్సవం వచ్చేసింది. దేశమంతా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేస్తారు. ప్రతి సంవత్సరం భారతీయులు జరుపుకునే ప్రధానమైన జాతీయ పండుగలైన స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day - ఆగస్ట్ 15), గణతంత్ర దినోత్సవం(Republic Day - జనవరి 26) సందర్భంగా జెండా ఎగురవేస్తారు. ఈ రెండు జాతీయ పండుగ రోజుల్లో జెండా ఎగరేయడం, ఆవిష్కరించడం.. చూడటానికి ఒకేలా కనిపించినప్పటికీ వాటి మధ్య సూక్ష్మమైన తేడా ఉంది. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day)

రెండు శతాబ్ధాల బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందింది. ఈ రోజు భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు కాబట్టి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆగష్టు 15న జాతీయ జెండాను జెండా కర్ర దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు.

జనవరి 26న గణతంత్ర దినోత్సవం(Republic Day)

మన దేశంలోని పాలన విధానం, చట్టాలు, పద్ధతులు, సంప్రదాయాలు, హక్కులు, బాధ్యతలు అన్నీ చెప్పేది రాజ్యాంగమే. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కాబట్టి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున జెండాను ముందగానే స్తంభం పై భాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు,. కాబట్టి దీన్ని జెండా ఆవిష్కరించడం అంటారు. గణతంత్ర దినోత్సవం రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాలకు నిబద్ధతను సూచిస్తుంది. వలస పాలన నుంచి సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా పరివర్తనను ప్రదర్శిస్తుంది.

ఇక మూడు రంగుల మువ్వన్నెల జెండాను స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత ప్రభుత్వ అధిపతిగా ప్రధానమంత్రి ఎగురవేస్తే.. గణతంత్ర దినోత్సవం నాడు రాజ్యాంగ అధిపతిగా ఉండే రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే, స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.

త్రివర్ణ పతాకం భారత పౌరుల సార్వభౌమత్వానికి, ఐక్యతకు ప్రతీక. పతాకానికి సంబంధించిన ఈ తేడాలు ప్రతి భారతీయుడు తెలుసుకోవటం ఎంతో ముఖ్యం.


Advertisement
Next Story

Most Viewed