Pahalgam Attack: పక్కా ప్లాన్ ప్రకారమే పహెల్గాం ఉగ్రదాడి

by Shamantha N |
Pahalgam Attack: పక్కా ప్లాన్ ప్రకారమే పహెల్గాం ఉగ్రదాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాంలోని బైసరన్‌ లోయలో పక్కా ప్లాన్ ప్రకారమే ముష్కరులు దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను దర్యాప్తు సంస్థలు తీసుకుంటున్నాయి. కాగా.. వాంగ్మూలాలతో ముష్కరులు మారణహోమం ఎలా చేశారో అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాల్లో ఉగ్రవాదులు ఉన్నారని వారు వెల్లడించారు. ఈ దాడి సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ గేటు నుంచి లోపలికి ప్రవేశించగా.. ఒకడు ఎగ్జిట్‌ గేటు వద్ద కాపలా ఉన్నాడు. ఈ దాడిలో తొలిసారి ఎగ్జిట్ గేటు వద్దే కాల్పులు మొదలైంది. దీంతో సందర్శకులు ప్రాణభయంతో ఎంట్రీ గేటు వైపు పారిపోయారు. అక్కడ ఉగ్రవాదులు వారిపై దాడి చేశారు. మరో ఉగ్రవాది తన సహచరులకు రక్షణ కల్పించేలా సమీపంలోని అడవిలో దాక్కొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వీరిలో ఇద్దరు సైనిక దుస్తులు ధరించగా.. ఒకడు సంప్రదాయ కశ్మీరీ డ్రెస్‌లో ఉన్నాడు.

దాడి జరిగిందిలా..

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటకులు ప్రవేశ ద్వారం వైపు పరిగెత్తడంతో మొదటి కాల్పులు జరిగాయి. వెంటనే గందరగోళం, భయాందోళనలు చెలరేగాయి. అయితే, ఇద్దరు ఉగ్రవాదులు వారిపై ఆకస్మికంగా దాడి చేయడానికి అప్పటికే అక్కడ ఉన్నారు. ఎంట్రీ గేట్ దగ్గర ఉగ్రవాదులు పర్యాటకులందరినీ ఒక్కచోట చేర్చారు. ఆ తర్వాత మహిళలు, పురుషులను వేరు చేశారు. అయితే, ప్రజలు అందుకు నిరాకరించారు. ఆ తర్వాత హిందువులను, ముస్లింలను వేరువేరుగా ఉండాలని చెప్పారు. దానికి కూడా బాధితులు నిరాకరించారు. ఆ తర్వాత కాల్పులు జరిపే ముందు కల్మా (ఇస్లామిక్ విశ్వాస ప్రకటన) పఠించమని ఉగ్రవాదులు కోరారు. ఆ తర్వాత హిందూ పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఇకపోతే, ఎంట్రీ గేట్ నుంచి వచ్చిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఉగ్రవాదుల కాల్పులకు గురైన మొదటి వ్యక్తిగా ఉన్నారు. టీ స్టాల్, భేల్పురి స్టాల్ ప్రాంతం సమీపంలో అత్యధికంగా ప్రాణనష్టం సంభవించింది. అక్కడ చాలా మంది గుమిగూడారు. దాడి తర్వాత ఉగ్రవాదులు పార్క్ ఎడమ వైపున ఉన్న గోడపై నుండి దూకి పారిపోయారని అధికారులకు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

స్పాట్ లో ఎన్ఐఏ బృందం..

మరోవైపు, ఇద్దరు ఎఫ్ఎస్ఎల్(FSL) సభ్యులతో కూడిన ఆరుగురు సభ్యుల ఎన్ఐఏ(NIA) బృందం స్పాట్ లో దర్యాప్తు కొనసాగిస్తోంది. అటవీ ప్రాంతం, ఉగ్రవాదులు బయటకు వచ్చే మార్గాన్ని ఎన్ఐఏ వీడియో తీస్తోంది. బైసరన్ పార్క్‌లో దుకాణాలు కలిగి ఉన్న 45 మంది స్థానికులు, పోనీ రైడ్ ఆపరేటర్లను ప్రశ్నిస్తున్నారు. కాల్పులు జరుగుతుండగా ఒక పర్యాటకుడు 'అల్లాహు అక్బర్' అని మూడుసార్లు నినాదాలు చేస్తున్న వీడియోలో బంధించబడిన జిప్‌లైన్ ఆపరేటర్‌ను కూడా విచారిస్తున్నారు. అంతేకాకుండా, ఉగ్రవాదులు "మొబైల్ పెయిడ్ అప్లికేషన్" ను ఉపయోగించారని ఎన్ఐఏ ఉన్నతాధికారులు తెలిపారు. వారు "పెయిడ్ ఎన్‌క్రిప్టెడ్ మొబైల్" ద్వారా పాకిస్థాన్ హ్యాండ్లర్లతో సంభాషించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, దక్షిణ కశ్మీర్‌లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ను ముమ్మరం చేశాయి.



Next Story