ఈ ఏడాది కూడా ఢిల్లీలో టపాసులు నిషేధం.. 2025 జనవరి 1 వరకు బ్యాన్

by vinod kumar |   ( Updated:2024-09-09 10:40:35.0  )
ఈ ఏడాది కూడా ఢిల్లీలో టపాసులు నిషేధం.. 2025 జనవరి 1 వరకు బ్యాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఏడాది కూడా బాణాసంచాపై నిషేధం విధించారు. 2025 జనవరి 1 వరకు టపాసుల తయారీ, అమ్మకం, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం ప్రకటించారు. చలికాలంలో కాలుష్య ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘గతేడాది మాదిరిగానే, ఈసారి కూడా అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకంపై పూర్తిగా నిషేధం విధించాం. తద్వారా ప్రజలు కాలుష్యం నుంచి విముక్తి పొందుతారు. ఆన్‌లైన్ డెలివరీలపై కూడా పూర్తి బ్యాన్ ఉంటుంది’ అని పేర్కొన్నారు.

దీపావళి పండుగను ప్రజలు దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచి జరుపుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పండుగ ఘనంగా జరపడం అవసరమే కానీ కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, రెవెన్యూ శాఖతో కూడిన సంయుక్త కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ నిషేధం అన్ని రకాల బాణసంచాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. వ్యాపారులు, డీలర్లు ఎలాంటి ఆర్థిక నష్టాన్ని చవి చూడాలని ఢిల్లీ ప్రభుత్వం కోరుకోవడం లేదన్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

Advertisement

Next Story