Hindenburg: 'హిండెన్‌బర్గ్‌పై తీవ్రమైన కేసు నమోదు చేయాలి': రాజ్యసభ ఎంపీ మహేష్ జెఠ్మలానీ

by S Gopi |
Hindenburg: హిండెన్‌బర్గ్‌పై తీవ్రమైన కేసు నమోదు చేయాలి: రాజ్యసభ ఎంపీ మహేష్ జెఠ్మలానీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధబి బురి బచ్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై తీవ్రమైన కేసు నమోదు చేయాలని రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ అన్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన సెబీని కోరారు. ఇప్పటికే సెబీ చేపడుతున్న దానికంటే మరింత సమగ్రమైన లోతైన దర్యాప్తు చేయాలని అన్నారు. 'ఇప్పటికే రిటైల్ ఇన్వెస్టర్లు చాలా డబ్బును కోల్పోయారు. తాజా కథనాలు స్టాక్ మార్కెట్‌ను కుదిపేయడానికి, భారత్‌ను అణగదొక్కేందుకు, దేశీయ కంపెనీ అదానీ గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న సమిష్టి ప్రయత్నమని ' జెఠ్మలానీ అన్నారు. హిండెన్‌బర్గ్ నివేదికలో ఏమీ లేదు. దాని మొత్తం నివేదికపై డీఆర్ఐ విచారణ జరిపించాలి. అంతేకాకుండా హిండెన్‌బర్గ్‌పై తీవ్రమైన కేసు నమోదు చేయాలి. అమెరికాలో చట్టపరంగా బోనులో నిలబెట్టాలని' చెప్పారు. అదానీ షార్ట్‌సెల్లింగ్‌కు సంబంధించి సమాచారం కోరుతూ హిండెన్‌బర్గ్‌కు సెబీ నోటీసు జారీ చేసింది. వీటికి ప్రతిస్పందించడానికి బదులుగా, హిండెన్‌బర్గ్ ఆసక్తి విరుద్ధమైన కారణాలతో సెబీ చీఫ్‌పైనే ఎదురుదాడి చేసింది. బదులివ్వకుండా భారత నియంత్రణ సంస్థ పరువు తీసే తరహాలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రవర్తిస్తోందని జెఠ్మలానీ తెలిపారు.

Advertisement

Next Story