రైతు ఉద్యమం : ఢిల్లీ సరిహద్దుల్లో మూడో రోజు.. ఏమైందంటే ?

by Hajipasha |
రైతు ఉద్యమం : ఢిల్లీ సరిహద్దుల్లో మూడో రోజు.. ఏమైందంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : అన్నదాతల నిరసనల హోరుతో ఢిల్లీ బార్డర్ వరుసగా మూడో రోజూ(గురువారం) మార్మోగింది. ఓ వైపు పోలీసుల యాక్షన్.. మరోవైపు రైతన్నల నినాదాల నడుమ హస్తిన సరిహద్దు ప్రాంతాలు అట్టుడికాయి. ఈ నిరసనల దృష్ట్యా సింఘూ బార్డర్‌ మీదుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు లగేజీలు మోసుకుంటూ కాలినడకన ఢిల్లీ-హర్యానా బార్డర్‌ను దాటారు. మరోవైపు పంజాబ్‌లో రైతులు నాలుగు గంటలపాటు నిర్వహించిన ‘రైల్ రోకో’ కార్యక్రమం వల్ల ఢిల్లీ-అమృత్‌సర్ మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు. ఇంకొన్ని ట్రైన్స్‌ను దారి మళ్లించారు. పంజాబ్ - హర్యానా మధ్యనున్న శంభు సరిహద్దు వద్ద నిరసన తెలుపుతున్న రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై సుదీర్ఘ పోరాటానికి అన్నదాతలు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 30వేల టియర్ గ్యాస్ షెల్స్‌ కోసం ఢిల్లీ పోలీసులు ఆర్డర్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని టెక్నాపూర్‌లో ఉన్న టియర్ స్మోక్ యూనిట్ నుంచి టియర్ గ్యాస్ షెల్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. వాటిని గ్వాలియ‌ర్ నుంచి ఢిల్లీకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇక రైతు సంఘాల నేతలతో రెండుసార్లు కేంద్ర సర్కారు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈనేపథ్యంలో గురువారం రాత్రి మరోసారి చండీగఢ్ వేదికగా రైతు నేతలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్యం శాఖ మంత్రి పీయూష్ గోయల్, హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ భేటీ అయ్యారు.

సైన్యం తరహాలో దేశ రాజధానిపైకి వస్తారా ? : హర్యానా సీఎం

ఏడు జిల్లాల్లో విధించిన మొబైల్ ఇంటర్నెట్ సేవల సస్పెన్షన్‌ను హర్యానా ప్రభుత్వం ఫిబ్రవరి 17 వరకు పొడిగించింది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఫైర్ అయ్యారు. సైన్యం తరహాలో దేశ రాజధానిలోకి ప్రవేశించాలని రైతులు భావించడం సరికాదని హితవు పలికారు. ‘‘రైతులు ఢిల్లీకి వెళ్లడంపై మాకు అభ్యంతరం లేదు. వాళ్లు ఢిల్లీకి వెళ్లేందుకు రైళ్లు, బస్సులను వాడాల్సింది. ట్రాక్టర్లు, ట్రాలీల్లో ఏడాదికి సరిపడా ఆహార పదార్థాలతో దేశ రాజధానికి వెళ్లడం వెనుక ఉద్దేశం ఏమిటి ? రైతుల నిరసన కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఏ లక్ష్యంతో నిరసన తెలుపుతున్నారనేది రైతులు ఆలోచించుకోవాలి’’ అని సీఎం ఖట్టర్ కామెంట్ చేశారు.

ఐరాసకు రైతుల లెటర్‌.. రంగంలోకి కేంద్రం

రైతుల ఉద్యమాన్ని కేంద్ర సర్కారు అణచివేస్తోందంటూ పలువురు అన్నదాతలు ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఐరాసను కోరారు. ఈ విధంగా లేఖ రాయడాన్ని కేంద్ర సర్కారు తప్పుపట్టింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కు రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని కేంద్రం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సత్యపాల్ జై సూచించారు. ఢిల్లీ బార్డర్‌ను సీజ్ చేయడాన్ని, ఇంటర్నెట్ సేవలను స్తంభింపజేయడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్).. రైతుల వల్ల హస్తిన బార్డర్‌లో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయంటూ మరో పిల్ పంజాబ్-హర్యానా హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సత్యపాల్ జై గురువారం వాదనలు వినిపించారు. దేశ అంతర్గత సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చొద్దని ఐరాసకు లేఖ రాసిన వారికి ఆయన సూచన చేశారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్ యూటీలు కూడా స్టేటస్ రిపోర్టులను కోర్టుకు సమర్పించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, అయితే అది అదుపులోనే ఉందని చెప్పాయి. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.

ప్రధాని మోడీ ఎన్నడూ ఆ హామీ ఇవ్వలేదు : ఎంఎస్పీ కమిటీ

కనీస మద్దతు ధరల(ఎంఎస్పీ)పై చట్టం చేస్తామని ప్రధాని మోడీ ఎన్నడూ రైతులకు హామీ ఇవ్వలేదని ప్రధానమంత్రి ఎంఎస్పీ కమిటీ సభ్యుడు బినోద్ ఆనంద్ స్పష్టం చేశారు. ‘‘నిరసనల్లో పాల్గొంటున్న రైతులు పోకిరీల్లా కనిపిస్తున్నారు.. కొంతమందిలో రాజకీయ దురుద్దేశం కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు రైతులను వాడుకుంటున్నారు’’ అని ఆయన ఆరోపించారు. ‘‘కనీస మద్దతు ధర అనేది చాలా టఫ్ సబ్జెక్ట్. రైతు సంఘాల నాయకులు వచ్చి మాతో కూర్చుంటే వివరిస్తాం. వాళ్లందరికీ నేను తగిన సమాధానం చెప్పలేకపోతే కేంద్ర ఎంఎస్పీ కమిటీకి రాజీనామా చేస్తాను’’ అని వెల్లడించారు. ‘‘రైతుల ఉద్యమం ఒక నాటకం. దేశ ప్రజల దృష్టి మరల్చడానికి, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పన్నిన కుట్ర ఇది’’ అని బినోద్ ఆనంద్ మండిపడ్డారు.

రైతులు నేడు పొలాలకు వెళ్లి పనిచేయొద్దు : రాకేష్ టికాయత్

శుక్రవారం నిర్వహించే ‘భారత్ బంద్’‌పై ​​భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ టికాయత్ మాట్లాడుతూ.. “మేం గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాం. రైతులు శుక్రవారం రోజు తమతమ పొలాలకు వెళ్లి పని చేయకూడదు. తద్వారా కొత్త తరహా నిరసనకు తెర తీయాలి. కార్మికులు కూడా సమ్మెకు దిగనున్నారు. ఉద్యమంలో ఎంత మంది పాల్గొంటున్నారో దీన్నిబట్టి తెలిసిపోతుంది’’ అని చెప్పారు. శుక్రవారం జరిగే భారత్ బంద్‌లో అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పాల్గొనాలని సంయుక్త కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేసింది.ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భారత్ బంద్ జరుగుతుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో మధ్యాహ్నం 12:00 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు రోడ్లను దిగ్బంధించాలని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed