Farmers issue: రైతుల సమస్యలపై కమిటీ వేయాలి..ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ప్రతిపాదన

by vinod kumar |
Farmers issue: రైతుల సమస్యలపై కమిటీ వేయాలి..ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ప్రతిపాదన
X

దిశ, నేషనల్ బ్యూరో: రైతుల సమస్యలపై చర్చించేందుకు ఓ కమిటీ వేయాలని పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. ఇందులో ప్రముఖులను చేర్చాలని తెలిపింది. వారం రోజుల్లోపు కమిటీ సభ్యుల పేర్లను సూచించాలని రెండు రాష్ట్రాలకు సూచించింది. శంభూ సరిహద్దును తెరవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై న్యాయమూర్తులు సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ‘రైతులు ఢిల్లీకి ఎందుకు రావాలనుకుంటున్నారు? మీరు వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారా? ఎవరైనా ప్రముఖ వ్యక్తి ద్వారా చర్చలు జరిపేందుకు ఏమైనా ప్రయత్నాలు జరిగాయా? జాతీయ రహదారిని ఎంతకాలం మూసి ఉంచుతారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

రైతులకు ప్రభుత్వంపై విశ్వాసం లోపించినట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది. నిరసన స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా శంభు సరిహద్దు వద్ద బారికేడ్లను తొలగించే ప్రణాళికలను రూపొందించాలని పేర్కొంది. కాగా, రైతుల ఉద్యమం కారణంగా హర్యానా ప్రభుత్వం శంభు సరిహద్దును బ్లాక్ చేసింది. అయితే శంభు సరిహద్దును వారంలోగా తెరవాలని జులై 10న హైకోర్టు ఆదేశించింది. దీంతో హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Advertisement

Next Story

Most Viewed