నకిలీ ఓటరు గుర్తింపు కార్డులపై చర్యలు

by Ajay kumar |
నకిలీ ఓటరు గుర్తింపు కార్డులపై చర్యలు
X

- మూడు నెలల్లో పరిష్కరిస్తాం

- ఇకపై జాతీయ స్థాయిలో ఓకే నంబర్

- వెల్లడించిన ఈసీఐ

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా నకిలీ ఓటరు గుర్తింపు కార్డులపై వెల్లువెత్తుతున్న ఆందోళన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా ఈ నంబర్లపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి విధివిధానాలను ప్రకటిస్తామని ఈసీఐ శుక్రవారం తెలిపింది. రాబోయే మూడు నెలల్లో నకిలీ ఓటర్ల నంబర్లపై అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో (సీఈవో) వివరణాత్మక చర్చలు, సంప్రదింపులు జరుపుతామని, ఆ తర్వాత జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన ఓటరు ఐడీ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఈసీఐ తెలిపింది.

'డూప్లికేట్ ఓటరు ఐడీ నంబర్ కలిగి ఉన్న ఓటర్లు, భవిష్యత్‌లో సరికొత్త జాతీయ ఓటర్ ఐటీ నంబర్ కలిగి ఉండేలా చూస్తారు. వారికి జాతీయ స్థాయిలో ఈపీఐసీ నంబర్‌ను నిర్ధారిస్తాము. ఇందు కోసం ఆయా రాష్ట్రాల సీఈవోలతో సంప్రదింపులు జరుపుతున్నాము. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని ఈసీఐ నిర్ణయించింది' అని కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, రాబోయే రెండు నెలల్లో నకిలీ నంబర్లను గుర్తించి, వాటిని తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని, ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఈవోలకు కొత్త సూచనలు పంపబడతాయని ఈసీ వర్గాలు చెప్పాయి.

కాగా, ఓటర్ డేటాలో ఉన్న నకిలీ ఓటర్ నంబర్లకు సంబంధించి ఆయా పార్టీలు వ్యక్తం చేసిన ఆందోళనలపై చర్చించడానికి ఇటీవల ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో ఓటర్ల జాబితాలో ఏవైనా నకిలీ ఎంట్రీలు, లోపాలు ఉంటే జాగ్రత్తగా సమీక్షించి దానికి అనుగుణమైన చర్యలు తీసుకోవాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాలో అనేక అక్రమాలు ఉన్నాయని, ఒకే ఓటరు గుర్తింపు సంఖ్యలు కూడా కనిపిస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఇటీవల ఆరోపించింది. ఈ అంశాన్ని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా లేవనెత్తుతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరం.



Next Story