Eknath Shinde : శివసేన మంత్రులకు రెండున్నరేళ్లే పదవి.. అఫిడవిట్లు రాయించుకోనున్న షిండే

by Hajipasha |
Eknath Shinde : శివసేన మంత్రులకు రెండున్నరేళ్లే పదవి.. అఫిడవిట్లు రాయించుకోనున్న షిండే
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో మళ్లీ కొలువుతీరిన మహాయుతి సర్కారులో షిండే శివసేనకు 11 మంత్రి పదవులు దక్కాయి. ఈ మంత్రి పదవులను చేపట్టిన శివసేన ఎమ్మెల్యేల నుంచి పార్టీ అధినేత ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) త్వరలోనే అఫిడవిట్లు రాయించుకుంటారని తెలుస్తోంది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవిని వీడేందుకు సిద్ధమేనని ఆ అఫిడవిట్లలో ఎమ్మెల్యేలతో షిండే రాయించుకోనున్నారని సమాచారం. తద్వారా రెండున్నరేళ్ల తర్వాత శివసేన(Shiv Sena)లోని ఇతర ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశాన్ని కల్పించాలని షిండే భావిస్తున్నారట. దీంతోపాటు శివసేన నుంచి మంత్రులయ్యే వారి పనితీరును స్వయంగా షిండే మానిటరింగ్ చేస్తారని, ఒకవేళ ఆ శాఖ పనితీరు సరిగ్గా లేకుంటే వారిని తప్పిస్తారని అంటున్నారు.

శివసేన నుంచి ఉదయ్ సమంత్, గుల్‌బ్రావ్ పాటిల్, దాదాజీ భుసే, సంజయ్ రాథోడ్, సంజయ్ శిర్సత్, శంభురాజ్ దేశాయ్, ప్రతాప్ సార్నాయక్, ప్రకాష్ అబిట్కర్, అశిష్ జైస్వాల్, భరత్‌షెట్ గోగవాలె, యోగేష్ కడమ్‌లు మంత్రులు అయ్యారు. వీరిలో అత్యధికులు షిండేకు అత్యంత సన్నిహితులే. శివసేన నుంచి మంత్రులైన వారిలో ముగ్గురు ఒకప్పుడు రిక్షా డ్రైవర్లుగా పనిచేసినవారే కావడం గమనార్హం. తాను గతంలో రిక్షా నడిపానని ఏక్‌నాథ్ షిండే చెబుతుంటారు. మంత్రి పదవిని దక్కించుకున్న శివసేన నేత ప్రతాప్ సర్నాయక్ ఒకప్పుడు డోంబివాలీలో రిక్షా నడిపేవారట. శివసేన నుంచి మంత్రి అయిన సంజయ్ శిర్సాత్ కూడా చాలా ఏళ్ల క్రితం ఛత్రపతి శంభాజీ నగర్‌లో రిక్షా నడిపారని అంటారు.

Advertisement

Next Story

Most Viewed