ఈడీ, సీబీఐలు బీజేపీకి రాజకీయ ఏజెంట్లు: టీఎంసీ నేత మహువా వ్యాఖ్యలు

by samatah |
ఈడీ, సీబీఐలు బీజేపీకి రాజకీయ ఏజెంట్లు: టీఎంసీ నేత మహువా వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: క్యాష్ అండ్ క్వెరీ కేసులో గతేడాది లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లు కాషాయ పార్టీకి రాజకీయ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు పన్నిన కుట్రలకు విజయంతోనే తగిన సమాధానం ఇస్తానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేవన్నారు. మంగళవారం ఆమె ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్నప్పటికీ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నికల కమిషనర్లను నియమించడంతో ఈసీ స్వతంత్రతను కోల్పోయిందని తెలిపారు. ఎన్నికలకు ముందు తన ప్రచారానికి అంతరాయం కలిగించడానికి, ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని, ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, వ్యాపారవేత్త హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణల నేపథ్యంలో పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మహువా మొయిత్రాపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్ సభ సెగ్మెంట్ నుంచి ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం మరొకసారి మహువా అదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. గెలుపుపై దీమా వ్యక్తం చేసిన మహువా.. మరోసారి ఎన్నికైతే లోక్ సభలో తన గళాన్ని విప్పుతానని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed