- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. అలా చేసినందుకు 2022లో ప్రభుత్వాన్నే కూల్చేశా'

- నా వ్యాఖ్యలు ఎవరి గురించో వారికి అర్థమవుతుంది
- మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్యలు
- షిండే, ఫడ్నవీస్ మధ్య పెరుగుతున్నగ్యాప్?
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో ముసలం పుట్టింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే మధ్య రోజు రోజకూ గ్యాప్ పెరుగుతున్నట్లు తెలిసింది. తాజాగా డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే చేసిన వ్యాఖ్యలు మహాయుతి ప్రభుత్వంలో ఉన్న విభేదాలను బయటపెట్టింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఫడ్నవీస్, ఏక్‌నాథ్ శిండేలు ఒకే వేదికను తరచుగా పంచుకోవడం లేదు. సీఎం ఫడ్నవీస్ ఏర్పాటు చేస్తున్న సమావేశాలకు కూడా శిండే గౌర్హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో శిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తన విరోధులు తనను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని.. కానీ వాళ్లు 2022లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని తాను కూల్చిన విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. 'నేను సాధారణ పార్టీ కార్యకర్తలను. అదే సమయంలో బాలా సాహెబ్ సేవకుడిని. ప్రతీ ఒక్కరు దీన్ని అర్థం చేసుకోవాలి. తనను లైట్‌గా తీసుకున్నందుకు 2022లో అధికార ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయం గుర్తుంచుకోవాలి' అని శిండే విలేకరులకు చెప్పారు.
'మహాయుతి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో నా మొదటి ప్రసంగంలోనే అన్ని విషయాలు చెప్పాను. దేవేంద్ర ఫడ్నవీస్ 200 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తారని ఆనాడే వివరించా. మేము 232 సీట్లు గెలిచాము. ఇదొక్క ఉదాహరణ చాలు తనకు ఏ విషయంపై ఎలాంటి అవగాహన ఉందో. అందుకే తనను లైట్ తీసుకోవద్దు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అంటున్నానో వారికి అర్థమవుతుంది' అని ఏక్‌నాథ్ శిండే చెప్పారు. కాగా, 2022లో శిండే వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి శివసేన పార్టీని చీల్చారు. అప్పటి ఎంవీయే ప్రభుత్వాన్ని గద్దె దించి.. బీజేపీ మద్దతుతో శిండే సీఎం అయ్యారు. ఇక తాజాగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో శిండే శివసేన 57 మంది ఎమ్మెల్యేలను, ఎన్సీపీ 41 మంది ఎమ్మెల్యేలను గెలిచింది. దీంతో మరోసారి ముఖ్యమంత్రి కుర్చీని ఏక్‌నాథ్ శిండే ఆశించారు. అయితే బీజేపీ మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి.. శిండే, అజిత్ పవార్‌లను డిప్యూటీ సీఎంలుగా చేసింది.
దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయినప్పటి నుంచి ఏక్‌నాథ్ శిండే బీజేపీతో సాన్నిహిత్యాన్ని తగ్గించారు. కీలకమైన సమావేశాలకు పిలిచినా వెళ్లడం లేదు. దీనికి తోడు తాజాగా శుక్రవారం జల్నాలో రూ.900 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టును దేవేంద్ర ఫడ్నవీస్ రద్దు చేశారు. గతంలో ఏక్‌నాథ్ శిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. దీన్ని ఫడ్నవీస్ రద్దు చేయడం ఇద్దరి నాయకుల మధ్య మళ్లీ గ్యాప్‌ను మరింతగా పెంచింది. ఈ నేపథ్యంలోనే శిండే పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.