70 మంది టీమ్‌తో దావోస్‌కు సీఎం షిండే.. ఆదిత్య థాక్రే సంచలన ఆరోపణలు

by Hajipasha |
70 మంది టీమ్‌తో దావోస్‌కు సీఎం షిండే.. ఆదిత్య థాక్రే సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన వర్గంపై.. ఉద్ధవ్ థాక్రేకు చెందిన శివసేన వర్గం కీలక నేత ఆదిత్య థాక్రే సంచలన ఆరోపణలు చేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈనెల 15 నుంచి జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సుకు విదేశాంగ శాఖ అనుమతి లేకుండానే 50 మందిని తీసుకెళ్లేందుకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సిద్ధమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతినిధి బృందంగా 10 మంది పేర్లకే విదేశాంగ శాఖ నుంచి మహారాష్ట్ర సర్కారు క్లియరెన్స్ పొందగా.. అంతకంటే ఐదారు రెట్ల మందిని దావోస్‌కు ఎలా తీసుకెళ్తున్నారని ఆదిత్య ప్రశ్నించారు. ‘‘ఇంత పెద్ద సంఖ్యలో ఏక్‌నాథ్ షిండే అండ్ టీమ్ చేయనున్న వ్యక్తిగత ప్రయాణానికి రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే ఆదాయాన్ని ఖర్చు చేయనున్నారు. 50 మంది షిండే వర్గం నాయకులతో పాటు వారి 20 మంది కుటుంబ సభ్యులు కూడా దావోస్‌కు వెళ్తున్నారు’’ అని ఆయన తెలిపారు. అదనంగా ఈ టూరులో వెళ్తున్న ప్రైవేటు వ్యక్తులపై ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికి పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చారా? అని భారత విదేశాంగ శాఖను ఆయన ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్ నుంచి షిండే వర్గం శివసేనలో చేరిన మిలింద్ దేవరా కూడా దావోస్‌కు వెళ్లే టీమ్‌లో ఉన్నారని సమాచారం.

Advertisement

Next Story