- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Delhi polling: ఢిల్లీలో 57.70 శాతం పోలింగ్.. అత్యధికంగా ఎక్కడంటే?

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 57.70 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 63.83 శాతం పోలింగ్ నమోదు కాగా, సౌత్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో అత్యల్పంగా 53.77 శాతంగా నమోదైంది. ఇక, ఢిల్లీ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్ లోని మిల్కిపూర్, తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరగగా ఆయా సెగ్మెంట్లతో వరుసగా 65.25 శాతం, 64.02 శాతం పోలింగ్ రికార్డైంది. ఈ నెల 8న ఫలితాలు వెల్లడించనున్నారు.
సీలంపూర్‌లో గందరగోళం
కేంద్ర పాలిత ప్రాంతంలోని 70 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినప్పటికీ సీలంపూర్‌లో బీజేపీ, ఆప్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. బురఖా ధరించిన మహిళలు నకిలీ ఓట్లు వేస్తున్నారని బీజేపీ ఆరోపించగా ఆప్ దానిని వ్యతిరేకించింది. ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్నికల దృష్యా పోలీసులు ఢిల్లీ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంగం విహార్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన దినేష్ మెహానియా తనకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఓ మహిళ అతనిపై ఫిర్యాదు చేసింది. అలాగే ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ పై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది.
ఓటేసిన ప్రముఖులు వీరే
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Murmu), ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ (Jagadeep dhankad), సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ పూరీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీలు ఓటేశారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్‌లు సైతం తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
వీల్ చైర్‌పై వచ్చి ఓటేసిన కేజ్రీవాల్ పేరెంట్స్
ఆప్ చీఫ్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌లు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కేజ్రీవాల్ తల్లి దండ్రులు వీల్ చైర్‌పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. అయితే కేజ్రీవాలే వారిని స్వయంగా వీల్ చైర్ పై తీసుకురావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.