రామ మందిర ట్రస్ట్‌ సమాచారాన్ని అందించాలనే ఉత్తర్వును కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

by S Gopi |
రామ మందిర ట్రస్ట్‌ సమాచారాన్ని అందించాలనే ఉత్తర్వును కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: సమాచార హక్కు చట్టం కింద అయోధ్యలో రామ మందిర నిర్మాణం, నిర్వహణను చూసే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును ఆదేశించిన కేంద్ర సమాచార కమిషన్ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. 2022, నవంబర్ 30 నాటి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్(సీఐసీ) ఉత్తర్వును సవాలు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) వేసిన పిటిషన్‌ను ఫిబ్రవరి 28న హైకోర్టు అనుమతించింది. ఐటీ చట్టం కింద అందుబాటులో ఉన్న సమాచారాన్ని నేరుగా సమకూర్చే అధికారం సీఐసీకి లేదని పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 138 ప్రకారం ఆదాయపు పన్ను రికార్డులకు సంబంధించిన సమాచారానికి మినహాయింపు ఉందని, ప్రత్యేక చట్టంగా ఉన్న విషయాన్ని సీఐసీ ఆదేశం పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కేంద్రం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. 2021, ఫిబ్రవరిలో కైలాష్ చంద్ర మూండ్రా ఆర్‌టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. రామ మందిరం ట్రస్ట్ తన విరాళాలకు మినహాయింపు పొందడం కోసం దాఖలు చేసిన పూర్తి దరఖాస్తు కాపీని కోరింది. 2022, నవంబర్‌లో కైలాష్ చంద్ర దాఖలు చేసిన దరఖాస్తుపై, సీఐసీ ఆదాయపు పన్ను సెక్షన్ 80 జీ(2)(బీ) కింద మినహాయింపు పొందడం కోసం రామాలయం ట్రస్ట్ దాఖలు చేసిన పూర్తి దరఖాస్తు కాపీని పంచుకోవాలని సీబీడీటీని కోరింది. ఈ సమాచారాన్ని మంజూరు చేయడం సాధ్యం కాదని కేంద్రం ఢిల్లీ హైకోర్టులో సీఐసీ ఉత్తర్వులను సవాలు చేసింది. తాజాగా జస్టిస్‌ సుబ్రమణియం ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం సీఐసీ ఆదేశాలను కొట్టివేసింది.

Advertisement

Next Story

Most Viewed