Delhi Elections: ఆదాయ పన్ను మినహాయింపు.. ఢిల్లీ ఎన్నికలపై ప్రభావమెంత?

by vinod kumar |
Delhi Elections: ఆదాయ పన్ను మినహాయింపు.. ఢిల్లీ ఎన్నికలపై ప్రభావమెంత?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Assmbly elections) జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరి కొద్ది గంటట్లోనే ప్రచారానికి సైతం తెరపడనుంది. అయితే సరిగ్గా ఎన్నికలకు నాలుగు రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఆదాయపన్నుపై మినహాయింపు ఇచ్చింది. దీని ప్రకారం.. రూ.12 లక్షల వార్షికాదాయం కలిగి ఉన్న వారిపై ఎలాంటి టాక్స్ ఉండదు. కొత్త పన్ను విధానంతో మధ్యతరగతి ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్టు అయింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులు ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం చూపనుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పన్ను మినహాయింపుతో బీజేపీకి కాస్త లాభం చేకూర్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ, ప్రయివేటు రంగ ఉద్యోగుల్లో అత్యధికులు ఢిల్లీలోనే ఉండడమే దీనికి కారణమని వాపోతున్నారు.

ఢిల్లీలో 45శాతం మధ్యతరగతి జనాభా!

దేశ రాజధానిలో ప్రస్తుతం మిడిల్ క్లాస్ జనాభా 45శాతం ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇది జాతీయ సగటు కంటే 31శాతం ఎక్కువ. గతంలో ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వీరి మద్దతుతోనే రెండు సార్లు విజయం సాధించింది. అలాగే 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ వారిపై ఫోకస్ చేసి మంచి ఫలితాలు రాబట్టింది. దీంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో సైతం ఎలాగైనా మధ్యతరగతి ప్రజల మద్దతు కూడగట్టాలని ఆప్, బీజేపీ, కాంగ్రెస్ లు భావించాయి. దీంతో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ మధ్యతరగతి బడ్జెట్ ముందుకు తీసుకొచ్చి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే ప్రధాని మోడీ సైతం మిడిల్ క్లాస్ ను ఉద్దేశించి పలు సభల్లో ప్రసంగించారు. పేదలు, మధ్య తరగతి ప్రజలకు పెద్ద పీట వేస్తు్న్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్‌లో పన్ను మినహాయింపు తీసుకొచ్చి వారికి బీజేపీ మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేసిందని తెలుస్తోంది.

ఆందోళనలో ఆప్!

సరిగ్గా ఎన్నికల ముందే బీజేపీ పన్ను మినహాయింపు ఇవ్వడంతో మధ్యతరగతి ఓటర్లపై ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో ఆప్ కు జైకొట్టిన ఓటర్లు మళ్లీ వారివైపే మొగ్గు చూపుతారా లేక టాక్స్ నుంచి ఊరట కల్పించిన బీజేపీ వైపు నిలుస్తారా అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు బీజేపీ వేసిన ఎత్తుగడతో ఆప్ వర్గాల్లో ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తోంది. ఆదాయపు పన్ను రాయితీతో మధ్యతరగతి ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతారేమేననే సందేహం కాంగ్రె, ఆప్ పార్టీల్లో నెలకొని ఉంటుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తు్న్నారు. అయితే ఆప్ పేద, దిగువ మధ్యతరగతి ప్రజల పార్టీగా ముద్రించబడిందని ఢిల్లీలో విద్యుత్, వైద్యం అందించడంతో వారు సఫలమయ్యారని కాబట్టి ప్రభావం పడకపోవచ్చని మరికొందరు భావిస్తున్నారు. కాగా, 2025 బడ్జెట్‌లో ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి ప్రకటన చేయరాదని ఎన్నికల సంఘం (ఈసీ) పేర్కొంది. దీంతో ఢిల్లీ గురించి బడ్జెట్ లో ప్రస్తావించలేదు.


Next Story