రేపే జార్ఖండ్‌లో విశ్వాస పరీక్ష.. ఎవరి బలం ఎంత ?

by Hajipasha |
రేపే జార్ఖండ్‌లో విశ్వాస పరీక్ష.. ఎవరి బలం ఎంత ?
X

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి సోమవారం తెరపడనుంది. భూకుంభకోణం కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో హుటాహుటిన గత శుక్రవారం సీఎంగా ప్రమాణం చేసిన చంపై సోరెన్‌ విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సారథ్యంలోని అధికార కూటమికి చెందిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఆదివారం మధ్యాహ్నమే రాంచీకి బయలుదేరారు. వీరంతా సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో జరిగే బలపరీక్షకు హాజరై చంపై సోరెన్‌కు తమ మద్దతును ప్రకటించనున్నారు. సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా, తొలిరోజే విశ్వాసపరీక్షను ఎదుర్కోవాలని చంపై సోరెన్ సర్కారు నిర్ణయించింది. మనీ లాండరింగ్ కేసులో గత బుధవారం అరెస్టయిన జేఎంఎం చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్ర అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన కూడా సోమవారం అసెంబ్లీ సెషన్‌లో పాల్గొననున్నారు. హేమంత్‌ సోరెన్‌కు ఇటీవల సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు కుట్రపూరితంగా తనను అరెస్టు చేశారని.. తన అరెస్టును చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని హేమంత్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. తాము ఈ అంశంలో జోక్యం చేసుకోబోమని, రాష్ట్ర హైకోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు?

మొత్తం 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గేందుకు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే జేఎంఎం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి కావాల్సిన దాని కంటే ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కువే ఉన్నారు. 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున విశ్వాస పరీక్షలో చంపై సోరెన్ అండ్ టీం నెగ్గడం దాదాపు ఖాయమే. జేఎంఎం కూటమిలో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), సీపీఐ(ఎంఎల్) పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. జేఎంఎంకు అత్యధికంగా 28 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 16 మంది, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్)లకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. ఇక బీజేపీ, మిత్రపక్షాలకు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎంఎం బలపరీక్షను ఎదుర్కోవడం ఇదే మొదటిసారేం కాదు. 2022 సెప్టెంబరులో బీజేపీ ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్ష తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్‌లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం అత్యధికంగా 48 ఓట్లు సాధించి నెగ్గింది. కాగా, రాంచీలోని మనీలాండరింగ్‌ నిరోధక ప్రత్యేక కోర్టు గత శుక్రవారం మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ను ఐదు రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది.

Advertisement

Next Story