రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ప్లేస్ మార్పుపై విమర్శలు

by Satheesh |   ( Updated:2023-02-09 17:14:22.0  )
రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ప్లేస్ మార్పుపై విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు రాజ్యసభలో సీటు కేటాయింపు విషయంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.అనారోగ్యం కారణంగా వీల్ చైర్‌లో రాజ్యసభకు వచ్చిన ఆయన సీటును ఫ్రంట్ రో నుంచి చివరి వరుసలోకి మార్చడంపై వికలాంగుల హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టసభల్లోనే ప్రముఖుల పరిస్థితి ఇలా ఉంటే ఇక బయట సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందటే.. రాజ్యసభలో మన్మోహన్ సింగ్‌కు ముందు వరుసలో సీట్‌ను కేటాయించారు. అయితే అనారోగ్య సమస్యలతో వీల్ చైర్‌కు పరిమితం అయిన ఆయన తన స్థానం వద్దకు నడిచి వెళ్లే పరిస్థితిలో లేరు. అక్కడి వరకు వీల్ చైర్‌లో కూడా వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తాను కూర్చునే సీటును మార్చాలని మన్మోహన్ సింగ్ కార్యాలయం పార్టీని కోరింది. దాంతో వీల్ చైర్‌లో వచ్చి కూర్చునేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీ ఆయన సీటును వెనుక వరుసలోకి మార్చింది. ఈ విషయం తెలిసిన వికలాంగుల హక్కుల కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు.

వికలాంగులైన వ్యక్తుల రాజకీయ ప్రాతినిధ్యానికి ఇలాంటి అవాంతరాలు ఉండవద్దని దీనికి సృజనాత్మకత పరిష్కారం ఉండాలని సూచిస్తున్నారు. మన్మోహన్ సింగ్ విషయంలో వయసు, చలనశీలత సమస్య కావొచ్చు కానీ కొంత మంది సభ్యులు గాయం లేదా అనారోగ్యం కారణంగా తాత్కాలిక వైకల్యాన్ని అనుభవించాల్సి వస్తే అలాంటి వారు తమకు కేటాయించిన స్థానాలకు వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. 2011లో పార్లమెంట్ భవనంలో థర్డ్ పార్టీ యాక్సెసిబిలిటీ ఆడిట్‌లో పాల్గొన్న వికలాంగుల హక్కుల న్యాయవాది, సమర్థ్యం ఎన్ జీఓ వ్యవస్థాపకురాలు అంజ్లీ అగర్వాల్ మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం మరుగుదొడ్లు లేదా ర్యాంప్‌లను నిర్మించడంతో సరిపోదని అన్నారు. ప్రస్తుతం కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం ఉన్నందున మన్మోహన్ సింగ్‌కు జరిగినది మరెవరికీ జరగకుండా న్యూ బిల్డింగ్‌లో అయినా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది వీఐపీ, వీవీఐపీల సమస్య గురించి కాదని సమానత్వానికి సంబంధించిన విషయం అన్నారు.

Advertisement

Next Story