‘సనాతన ధర్మం’పై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట

by Hajipasha |
‘సనాతన ధర్మం’పై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట
X

దిశ, నేషనల్ బ్యూరో : సనాతన ధర్మంపై వ్యాఖ్యల వివాదంలో తమిళనాడు సీఎం తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు స్వల్ప ఊరట లభించింది. ఉదయనిధితో పాటు మరో ఇద్దరు డీఎంకే నేతలు చట్టసభల సభ్యులుగా కొనసాగడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టేసింది. గతేడాది సెప్టెంబరులో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకం’’ అని కామెంట్ చేయడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఆయన చట్టసభ సభ్యుడిగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అప్పటి కార్యక్రమంలో పాల్గొన్న పీకే శేఖర్ బాబు, స్టాలిన్ వ్యాఖ్యలు సమర్థించిన ఎంపీ ఎ.రాజా పేర్లను కూడా ఈ పిటిషన్‌లో చేర్చారు. ఈ విచారణ వేళ మంత్రి ఉదయనిధి వ్యాఖ్యలను మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. అయితే ఇప్పటివరకు ఆయన దోషిగా తేలలేదని గుర్తుచేసిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. మరోవైపు ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యలపై ఇటీవల విచారించిన సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘‘మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదా? మీరేం సామాన్య పౌరుడు కాదు. ఓ మంత్రి పదవిలో ఉన్నారు’’ అని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు హితవు పలికింది. దీనిపై తదుపరి విచారణను మార్చి 15కు వాయిదా వేసింది.

Advertisement

Next Story