అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్ట్

by S Gopi |
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో అంశం పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన గుజరాత్ పోలీసులు నకిలీ వీడియోను షేర్ చేశారనే ఆరోపణల మీద ఒక కాంగ్రెస్ నేత కీలక అనుచరుడితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన కార్యకర్తను అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ సెల్ అరెస్ట్ చేసినట్టు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ కేసు విషయమై దర్యాప్తు చేపట్టిన అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ సెల్.. బనస్కంతాకు చెందిన సతీష్ వన్సోలా, దాహోద్ జిల్లా లింఖెడా పట్టణానికి చెందిన రాకేశ్ బరియాను అదుపులోకి తీసుకుంది. వారిద్దరిలో సతీష్ అనే వ్యక్తి గడిచిన ఆరు సంవత్సరాలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీకి పీఏగా పనిచేస్తున్నారని, రాకేశ్ బరియా నాలుగేళ్ల నుంచి ఆప్ దాహోద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు. 'వారిద్దరికీ హోం మంత్రి ఫేక్ వీడియో వాట్సాప్ ద్వారా వచ్చింది. దాన్ని ఉద్దేశపూర్వకంగానే ఫేస్‌బుక్ పేజీల్లో షేర్ చేశారు. ఈ క్రమంలో ఎవరు ఎడిట్ చేశారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామని సైబర్ సెల్ డిప్యూటీ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై స్పందించ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవాని.. బీజేపీ ఐటీ విభాగం ఎప్పటినుంచో ఫేక్ వీడియోలను చేస్తొంది. దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సామాన్యులను అరెస్ట్ చేస్తున్నారు. సతీష్ సైతం పొరపాటుగానే సదరు వీడియోను షేర్ చేశాడని వెల్లడించారు. కాగా, ఈ నెల 23న తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ బద్ధంగా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను వారికిస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలను వక్రీకరించిన కొందరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల రద్దు చేస్తారన్నట్టు ఎడిట్ చేసిన ఫేక్ వీడియో సర్క్యులేట్ చేశారు. దీనిపై హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story