ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేసే టైం ఇంకా రాలేదు.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

by vinod kumar |   ( Updated:2024-08-05 13:35:51.0  )
ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేసే టైం ఇంకా రాలేదు.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను త్వరలోనే ఉపముఖ్యమంత్రిగా నియమించబోతున్నారని వెలువడుతున్న కథనాలపై ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) చీఫ్, సీఎం స్టాలిన్ స్పందించారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయడానికి ఇంకా టైం రాలేదని తెలిపారు. అయితే పార్టీలో ఈ డిమాండ్ బలంగా వినపడుతోందన్నారు. కానీ నిర్ణయం తీసుకోవడానికి అందరితో చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఓ అధికారిక కార్యక్రమం సందర్భంగా స్టాలిన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయాలనే డిమాండ్‌పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, దానిని పరిగణనలోకి తీసుకుంటారా అని పశ్నించగా ఆయన స్పందించారు. పార్టీ శ్రేణుల నుంచి ఎప్పటి నుంచో ఈ ప్రతిపాదన ఉందని, కానీ దానికి ఇంకా సమయం ఉందని వెల్లడించారు. కాగా, సీఎం స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి ప్రస్తుతం క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Advertisement

Next Story