- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ ఏడాది కూడా జనగణన లేనట్లేనా!

- బడ్జెట్‌లో రూ.574.80 కోట్లు కేటాయింపు
- సెన్సెస్, ఎన్‌పీఆర్‌కు మొండిచేయి
దిశ, నేషనల్ బ్యూరో:
గత ఐదేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనగణన, జాతీయ జనాభా రిజిస్టర్‌ల అప్‌డేషన్ ఈ ఏడాది కూడా నిర్వహించడం కష్టమేనని తెలుస్తోంది. పదేళ్లకు ఒకసారి నిర్వహించాల్సిన జనగణన వాస్తవానికి 2020లోనే చేపట్టాల్సి ఉంది. సెన్సెస్-2021కి రూ.8,754.23 కోట్లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్)ల అప్‌డేషన్ కోసం రూ.3,941.35 కోట్ల మేర ఖర్చు అవుతుందని 2019 డిసెంబర్ 24న కేంద్ర కేబినెట్ ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలకు సంబంధించిన హౌస్ లిస్టింగ్, ఎన్‌పీఆర్ అప్‌డేషన్‌ను 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిర్వహించాలని షెడ్యూల్ కూడా రూపొందించారు. అయితే కోవిడ్ 19 కారణంగా జన గణన ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. కోవిడ్ పాండమిక్ ముగిసినా ఇంత వరకు సెన్సెస్ నిర్వహణ ప్రారంభం కాలేదు. జమిలీ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన కోసం ఈ ఏడాది తప్పకుండా జనగణన నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. అయితే 2025-26 బడ్జెట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. 2021-22లో సెన్సెస్, సర్వేస్, స్టాటిస్టిక్స్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు రూ.3,768 కోట్లు కేటాయించింది. కానీ ఇన్నేళ్లు అయినా జనగనణ ప్రారంభించలేదు. తాజాగా బడ్జెట్‌లో కేవలం రూ.574.80 కోట్లు మాత్రమే కేటాయించడంలో ఈ ఏడాదైనా జనగణన ఉంటుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. 2024-25లో ఇదే పద్దులో రూ.572 కోట్లు కేటాయించగా.. ఈ సారి మరో రెండు కోట్లు మాత్రమే అదనంగా ఇచ్చింది. అధికారుల లెక్కల ప్రకారం జనగణన, ఎన్‌పీఆర్ కోసం రూ.12 వేల కోట్లు అవసరం అవుతాయి.
కాగా.. దేశంలో జనగణన ఎప్పుడు నిర్వహించినా అవి మొట్టమొదటి డిజిటల్ సెన్సెస్‌గా రికార్డు సృష్టించనున్నాయి. దేశ పౌరులే స్వయంగా జనాభా లెక్కల్లో తమ పేర్లను గణించుకునే అవకాశం ఉంటుంది. సెన్సెస్ ఫామ్‌ను భర్తీ చేసే హక్కును పొందాలంటే తప్పని సరిగా ఎన్‌పీఆర్‌లో నమోదై ఉండాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ ఎన్యుమరేషన్ సమయంలో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.