మహువా మొయిత్రా నివాసాల్లో సీబీఐ సోదాలు: క్యాష్ ఫర్ క్వెరీ కేసులో చర్యలు

by samatah |   ( Updated:2024-03-23 06:19:33.0  )
మహువా మొయిత్రా నివాసాల్లో సీబీఐ సోదాలు: క్యాష్ ఫర్ క్వెరీ కేసులో చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారని (క్యాష్ ఫర్ క్వెరీ) తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ ఎంపీ మహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు శనివారం కోల్‌కతా, ఇతర నగరాల్లోని మహువా నివాసాల్లో సోదాలు నిర్వహించారు. మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని లోక్‌పాల్ ఇటీవల సీబీఐని ఆదేశించింది. ప్రతినెలా రిపోర్టును అందజేయాలని తెలిపింది. లోక్‌పాల్ ఆర్డర్స్ మేరకు మార్చి 21న మహువాపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ క్రమంలోనే దాడులు చేసినట్టు తెలుస్తోంది.

కాగా, పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ..ప్రశ్నలు అడిగినందుకు బదులుగా వ్యాపార వేత్త హీరానందాని నుంచి మహువా డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ అంశంపై ఇన్వెస్టిగేషన్‌కు ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎథిక్స్ కమిటీ మహువాను దోషిగా తేల్చింది. అనంతరం ఆమెపై గతేడాది డిసెంబర్‌లో స్పీకర్ బహిష్కరణ వేటు వేయగా..లోక్ సభ సభ్యత్వం రద్దయింది. దీనిని మహువా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు మహువా కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed