ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు ఇవ్వలేం: సుప్రీంకోర్టు

by Satheesh |   ( Updated:2023-02-13 08:38:21.0  )
ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు ఇవ్వలేం: సుప్రీంకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్‌లో డీలిమిటేషన్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ప్రకారం ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా తీర్పు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం సోమవారం పేర్కొంది. 2019లో జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక హోదా (ఆర్టికల్ 370)ను రద్దు చేసిన తర్వాత రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయాయి.

ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రస్తుతం కశ్మీర్ డివిజన్‌లో 46, జమ్ము డివిజన్‌లో 37 కలిపి మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 ఉండగా వాటిని 90 స్థానాలకు పెంచాలని ప్రతిపాదించింది. అలాగే చరిత్రలోనే తొలిసారి షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు 9 సీట్లు కేటాయించింది. కమిటీ ప్రతిపాదనలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ నోటిఫికేషన్‌లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా డీలిమిటేషన్ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం లేదని పిటీషనర్లు వాదించగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం డీలిమిటేషన్‌ను 2026 తర్వాత మాత్రమే చేపట్టాల్సి ఉన్నప్పటికీ జమ్మూ-కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి దీని నుండి ప్రత్యేకించబడిందని కోర్టుకు కేంద్రం తెలిపింది. దాఖలైన పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత డిసెంబర్ 1న సంజయ్ కిషన్ కౌల్, ఎఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సోమవారం ఈ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది.

Advertisement

Next Story

Most Viewed