BSF: బీఎస్ఎఫ్, చొరబాటుదారుల మధ్య ఘర్షణ.. జవాన్లపై కత్తులు, కర్రలు, వైర్ కట్టర్లతో దాడి

by vinod kumar |
BSF: బీఎస్ఎఫ్, చొరబాటుదారుల మధ్య ఘర్షణ.. జవాన్లపై కత్తులు, కర్రలు, వైర్ కట్టర్లతో దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) లోని భారత్-బంగ్లాదేశ్ (India- Bangladesh) అంతర్జాతీయ సరిహద్దులో బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (Bsf), చొరబాటుదారుల మధ్య బుధవారం తెల్లవారుజామున ఘర్షణ జరిగింది. బంగ్లాదేశ్‌కు చెందిన కొంత మంది భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా బీఎస్ఎఫ్ దానిని అడ్డుకుంది. ఈ క్రమంలోనే వారు బీఎస్ఎఫ్ సిబ్బందితో గొడవపడ్డట్టు అధికారులు తెలిపారు. ఉత్తర బెంగాల్‌లోని దక్షిణ్ దినాజ్‌పూర్ (Dhinaj pur) జిల్లాలో ఈ ఘటన చోటుచేసున్నట్టు వెల్లడించారు. బీఎస్ఎఫ్ జవాన్లపై చొరబాటుదారులు కత్తులు, కర్రలు, వైర్ కట్టర్లతో దాడి చేయగా ఓ సైనికుడికి గాయాలయ్యాయి. అలాగే పలువురు దుండగులకు సైతం గాయాలైనట్టు తెలుస్తోంది. పరిస్థితి అదుపు తప్పడంతో వారిపై కాల్పులు జరపగా చొరబాటు దారులు బంగ్లాదేశ్ వైపు పారిపోయారు.

ఘటన స్థలంలో దట్టమైన పొగమంచు ఉందని బీఎస్ఎఫ్ తెలిపింది. దర్యాప్తులో భాగంగా అక్కడ కంచె కత్తిరించబడి ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి కర్రలు, పదునైన ఆయుధాలు, వైర్ కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యల్లో భాగంగా గాయపడిన ఒక బంగ్లాదేశ్ పౌరుడు గాయాలతో బీఎస్ఎఫ్‌కు చిక్కగా ఆయనను చికిత్స నిమిత్తం గంగారాంపూర్ ఆస్పత్రికి తరలించారు. అలాగే గాయపడిన సైనికుడికి వైద్య సహాయం అందించామని ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని బీఎస్ఎఫ్ వెల్లడించింది. మరోవైపు సరిహద్దు వెంబడి బంగ్లాదేశీయుల అక్రమ నిర్మాణాలపై బీఎస్‌ఎఫ్ గట్టి చర్యలు తీసుకుంటోందని తెలిపింది.

Next Story