బీజేపీ భారత్‌కు ఇష్టమైన పార్టీ: ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మోడీ కీలక వ్యాఖ్యలు

by samatah |
బీజేపీ భారత్‌కు ఇష్టమైన పార్టీ: ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఆ పార్టీపై ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీ ప్రస్తుతం భారతీయులు ఇష్టపడే పార్టీగా మారిందని కొనియాడారు. ప్రజలు మరోసారి కాషాయ పార్టీకి పట్టం కడతారని దీమా వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా ప్రజల మన్ననలను పొందిన పార్టీగా అవతరించిందని తెలిపారు. 21వ శతాబ్దంలో దేశానికి నాయకత్వాన్ని అందించగల ఏకైక పార్టీగా యువత చూస్తున్నారన్నారు. అవినీతి, కులతత్వం, మతతత్వం ఓటు బ్యాంకు రాజకీయాల సంస్కృతి నుంచి దేశాన్ని బీజేపీ విముక్తి చేసిందని చెప్పారు. నేటి భారతదేశంలో, ఎలాంటి వివక్ష లేకుండా స్వచ్ఛమైన, పారదర్శకమైన పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. అందుకే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని గుర్తు చేశారు.

‘కేంద్రం లేదా రాష్ట్రాల్లో, బీజేపీ సుపరిపాలనను పునర్నిర్వచించింది. కాషాయ పార్టీ తీసుకొచ్చిన పథకాలు, విధానాలు పేదలు, అణగారిన వర్గాలకు బలాన్నిచ్చాయి’ అని తెలిపారు. ఎంతో మంది త్యాగాల మూలంగానే బీజేపీ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ‘నేషన్ ఫస్ట్’ అనే నినాదంతో బీజేపీ ఎల్లప్పుడూ పని చేస్తుందని వెల్లడించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రస్తావిస్తూ.. ‘భారతదేశం కొత్త లోక్‌సభను ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉంది, ప్రజలు మరొకసారి ఎన్డీయేను ఆశీర్వదించబోతున్నారు’ అని స్పష్టం చేశారు.

కాగా, 1980లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) స్థాపించారు. 1984లో తొలిసారి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయగా..కేవలం రెండు లోక్ సభ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. మొట్టమొదటి సారిగా 1999 నుంచి 2004 వరకు కేంద్రంలో ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014, 2019 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీలో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed