ప్రజల ప్రాణాలతో బీజేపీ చెలగాటం: కోవీషీల్డ్ వ్యవహారంపై అఖిలేష్ యాదవ్

by S Gopi |
ప్రజల ప్రాణాలతో బీజేపీ చెలగాటం: కోవీషీల్డ్ వ్యవహారంపై అఖిలేష్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ వల్ల కలిగే అరుదైన దుష్ప్రభావాల గురించిన ఆందోళనల మధ్య సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బుధవారం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి రాజకీయ విరాళాలు తీసుకోవడానికే ప్రజల ప్రాణాలతో బీజేపీ చెలగాటమాడుతోందని విమర్శించారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రాణాంతకమైన ఔషధాలను అనుమతించడమంటే హత్య చేసేందుకు కుట్ర పన్నడం లాంటిదేనని, ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ తక్షణం జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సుమారు 80 కోట్ల మంది దేశ ప్రజలు ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ కంపెనీ నుంచి బీజేపీ భారీ మొత్తంలో కమిషన్ తీసుకుంది. అందుకనే ప్రజలను బలవంతపెట్టి ఆ వ్యాక్సిన్‌ను ఇచ్చారు. దీనిపై బీజేపీని ప్రజలు ఎన్నడూ క్షమించరని అఖిలేష్ పేర్కొన్నారు. భారతీయుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే వారిపై చర్యపు తప్పవని అన్నారు. వ్యాక్సిన్లు ఇచ్చిన వారిపై, ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాక్సిన్ వల్ల గుండె, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం కంటే పెద్ద నేరం బీజేపీ చేసిందని ఆరోపించారు. కాగా, తమ కొవిడ్ వ్యాక్సిన్ అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డ కట్టేందుకు కారణమవుతుందని బ్రిటన్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా అక్కడి కోర్టుకు తెలియజేసింది. దీంతో భారత్‌లో దీనిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story