కొడుకు పట్టించుకుంటలేడని ఓ వృద్ధ తండ్రి ఏం చేశాడో తెలిస్తే షాకవడం ఖాయం!

by Javid Pasha |
కొడుకు పట్టించుకుంటలేడని ఓ వృద్ధ తండ్రి ఏం చేశాడో తెలిస్తే షాకవడం ఖాయం!
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులకు మంచి చెడులు నేర్పించే ఓ టీచర్.. తన తండ్రి విషయంలో మాత్రం దారుణంగా వ్యవహరించాడు. పెంచి ఓ ప్రయోజకున్ని చేసిన తండ్రిని భారంగా భావించి వృద్ధాశ్రమంలో వదిలేశాడు. అనంతరం తన భార్యా పిల్లలతో హాయిగా ఉండసాగాడు. అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు తనను అలా వదిలేయడంతో ఆ తండ్రికి బాధేసింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగి కొడుకుకు, కూతుళ్లకు తగిన గుణపాఠం చెప్పాడా తండ్రి. ఇంతకు ఆ వృద్ధ తండ్రి తన పిల్లలకు ఏ విధంగా గుణపాఠం చెప్పాడో తెలిస్తే మాత్రం షాకవడం ఖాయం.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజాఫర్ నగర్ కు చెందిన నాథ్ సింగ్ కు 85 ఏళ్లకు పైనే ఉంటాయి. ఆయనకు ఓ కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు, కూతుళ్లను చదివించి ప్రయోజకులను చేశాడు. అనంతరం వారికి పెళ్లిల్లు కూడా చేశాడు. అయితే వృత్తి రీత్యా ప్రభుత్వ టీచర్ అయిన కొడుకు అతడి కుటుంబంతో కలిసి సహరాన్ పూర్ లో ఉంటున్నాడు. కూతుళ్లందరికీ పెళ్లిల్లు కావడంతో వాళ్లంతా అత్తగారింట్లో ఉంటున్నారు. కాగా కొన్నేళ్ల కిందట నాథ్ సింగ్ భార్య చనిపోయింది. అప్పటి నుంచి తానొక్కడే గ్రామంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో తండ్రి ఆలనా పాలన చూడాల్సిన కొడుకు తన బాధ్యతలను మరిచాడు. తండ్రిని భారంగా భావించి ఆయనను ఓ వృద్ధాశ్రమంలో చేర్పించాడు. దీంతో ఆ ముసలి తండ్రి తన కొడుకు, కూతుళ్లు, మనవళ్లను తలచుకొని రోజూ ఏడ్చేవాడు. ఏదో ఒక రోజు తనను చూడటానికి తనవాళ్లు రాకపోతారా అని ఎదురుచూసేవాడు.

కానీ ఏడు నెలలు గడిచినా ఎవరూ రాకపోవడంతో ఆ వృద్ధుడు నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు. ఆశ్రమంలోని సహచరులు ధైర్యం చెప్పడంతో తేరుకొని తన పిల్లలకు తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఈ క్రమంలోనే గ్రామంలో తన పేరు మీద ఉన్న రూ.1.5 కోట్ల విలువైన ఇల్లు, వ్యవసాయ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పుతూ వీలునామా రాశాడు. తాను చనిపోయాక వాటితో ప్రజల కోసం ఓ ఆసుపత్రిని గానీ లేక పాఠశాలను గానీ నిర్మించాలని వీలునామాలో పేర్కొన్నాడు. అంతేకాకుండా చనిపోయాక తన బాడీని మెడికల్ కాలేజ్ కు అప్పగించాలని కోరాడు. ఈ సందర్భంగా నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఈ వయసులో నా కొడుకు, కోడలుతో కలిసి జీవించాల్సిన నేను వృద్ధాశ్రమంలో ఉంటున్నా. అందుకే నా ఆస్తినంతా ప్రభుత్వానికి రాసి ఇచ్చాను’’ అని తెలిపాడు.

Advertisement

Next Story