Supreme Court: వ్యక్తిగత పగలతో కేసు పెడితే తీవ్రంగ స్పందించాల్సి వస్తుంది

by Shamantha N |
Supreme Court: వ్యక్తిగత పగలతో కేసు పెడితే తీవ్రంగ స్పందించాల్సి వస్తుంది
X

దిశ, నేషనల్ బ్యూరో: వ్యక్తిగత పగలతో భర్తపై వరకట్న వ్యతిరేక చట్టం కింద కేసు(Dowry Cases) పెట్టడాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్రంగా పరిగణించింది. భర్త, అతని కుటుంబసభ్యులపై అనవసరంగా కేసులు పెట్టడం వేధింపుల కిందకు వస్తుందని మండిపడింది. ఇళాంటి కేసులో విషయంలో ఇకపై తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించింది. ‘‘498ఏ సెక్షన్‌(వరకట్న వ్యతిరేక చట్టం).. గృహ హింస, వరకట్న వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికే. కానీ, ఈ మధ్యకాలంలో మార్పు కనిపిస్తోంది. చాలామంది మహిళలు తమ గొంతెమ్మ కోర్కెలు నెరవేర్చుకోవడానికి దీన్నీ ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇలాంటి వైఖరిని ఎట్టిపరిస్థితుల్లో సహించబోం’’ అని జస్టిస్‌ బీవీ నాగరత్న, ఎన్‌ కోటీశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం పేర్కొంది.

భర్తపై నిరాధార ఆరోపణలు

తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అయితే ఆ తర్వాత ఆ భార్య.. భర్త, అతని కుటుంబం తనను వేధిస్తోందంటూ 498ఏ కింద వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ భర్త హైకోర్టును(Telangana High Court) ఆశ్రయించినా.. ఊరట దక్కలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే, ఈ కేసు విచారణ సమయంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇక్కడ వ్యక్తిగత కక్షతో భర్తపైన వరకట్న నిషేధ చట్టాన్ని ఆమె ఆయుధంగా వాడాలనుకుంది. ఈ కేసులో భర్తపై నిరాధార ఆరోపణలు చేసింది. భర్తను, అతని కుటుంబాన్ని వేధించాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి కేసుల్లో విచారణ సజావుగా జరగాలి. లేదంటే.. చట్టప్రక్రియల దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలమైంది. ఈ కేసును కొట్టివేయకపోవడం ఆ కోర్టు చేసిన తప్పిదం’’ అని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. అయితే.. అలాగని.. అన్ని కేసులపై ఈ కామెంట్స్ చేయట్లేదని, వైవాహిక చట్టాల్ని దుర్వినియోగం చేయడంపైనే తమ ఆందోళన అని కోర్టు తెలిపింది. కాగా.. బెంగళూరులో 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత కోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story