అమెరికా, భారత్‌లు టెక్నాలజీలో ముందుండాలి..జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్

by vinod kumar |
అమెరికా, భారత్‌లు టెక్నాలజీలో ముందుండాలి..జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
X

దిశ, నేషనల్ బ్యూరో: వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో భారత్, అమెరికాలు ముందంజలో ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. అమెరికా ప్రతినిధి జేక్ సల్లివన్ సమక్షంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. యూఎస్‌లో భారతీయ పరిశ్రమకు ద్వైపాక్షిక మద్దతు ఉంది. పర్యావరణ వ్యవస్థను నిర్మించడం, ఉత్పత్తికి సరఫరా గొలుసు తయారీకి ఎంతో కీలకం’ అని తెలిపారు. సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య గొప్ప సహకారాన్ని రూపొందించే లక్ష్యంతో 2022మేలో ప్రధాని నరేంద్ర మోడీ, యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌లు ఐసీఈటీని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇది ఊహించిన దాని కంటే ఎక్కువ ఫలితాలను ఇచ్చిందని నొక్కి చెప్పారు.

‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, బయోటెక్, డిఫెన్స్ ఇన్నోవేషన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి సారించిన రెండు దేశాల మధ్య ల్యాండ్‌మార్క్ చొరవను ఐసీఈటీ సూచిస్తుంది. ఇది ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తోంది. కాబట్టి భారత్-యూఎస్ సంబంధాలలో కూడా ఒక ముఖ్యమైన పరిణామం’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ సహా పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. కాగా, రెండ్రోజుల పర్యటన నిమిత్తం సల్లివన్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed