కౌన్ బనేగా కర్ణాటక కింగ్..? మరికొన్ని గంటల్లో తేలనున్న నేతల భవితవ్యం

by Satheesh |
కౌన్ బనేగా కర్ణాటక కింగ్..? మరికొన్ని గంటల్లో తేలనున్న నేతల భవితవ్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం అయింది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికర ఫలితాలను రిలీజ్ చేసిన నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ త్రిముఖ పోరు ఖాయం అన్న అంచనాలతో ఫలితాలపై జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ అభ్యర్థులపై రూ.5 లక్షల వరకు బెట్టింగులు సాగుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి కొన్ని సెగ్మెంట్లలో క్యాష్, ల్యాండ్, బాండ్ పేపర్లతో కూడా బెట్టింగులకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఆపరేషన్ కమలానికి చిక్కకుండా జాగ్రత్తలు:

ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. ఆపరేషన్ కమలానికి చిక్కకుండా కాంగ్రెస్ ఇప్పటికే అలర్ట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. గెలుస్తారని అంచనాతో ఉన్న అభ్యర్థులు చేజారిపోకుండా తమ అభ్యర్థులపై ఓ కన్నేసి ఉంచగా.. హంగ్ వస్తే కింగ్ మేకర్ అవుతుందని భావిస్తున్న జేడీఎస్ తమ స్టాండ్ ఏంటనేది ఉత్కంఠగా మారింది. అయితే తమ నిర్ణయం ఇప్పటికే తీసుకున్నామని ఫలితాలు వెలువడిన అనంతరం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని జేడీఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో కుమార స్వామి కింగ్ మేకర్ అవుతారా లేక కాలం కలిసి వస్తే కింగే అవుతారా అనేది సస్పెన్స్‌గా మారింది.

కాంగ్రెస్ ఐక్యత రాగం:

మరో వైపు గెలుపుపై బీజేపీ ధీమాతో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అటు ఇటుగా ఉంటాయని అందువల్ల రేపటి ఫలితాల్లో తమకు అనుకూలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రేపటి ఫలితాల్లో హంగ్ పరిస్థితి ఉండబోదని బీజేపీనే సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం బసవరాజు బొమ్మై స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ తమ మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి ఐక్యత రాగం ఆలపిస్తోంది. తమ పార్టీ గెలిస్తే సీఎం పోస్ట్ ఎవరికి అనే విషయంపై కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరే ముఖ్యమంత్రి అవుతారా అనే ప్రశ్నకు సమాధానంగా.. తొలుత పార్టీ గెలవడం ముఖ్యం. పార్టీ గెలిచిన వెంటనే తన కార్యాచరణ మొదలవుతుందని చెప్పారు.

కొత్త వ్యక్తి సీఎం?:

ఇక బీజేపీలోనూ సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. కాషాయ జెండా ఎగిరితే ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైనే కొనసాగుతారా లేకా కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకువస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రేపు ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఇవాళ అన్ని పార్టీల కీలక నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో తమ భవిష్యత్ కార్యచరణ ఎలా ఉండాలనేదానిపై చర్చించినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed