ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి చూపు ఆ మూడింటిపైనే.!

by John Kora |   ( Updated:2025-01-11 16:32:04.0  )
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి చూపు ఆ మూడింటిపైనే.!
X

దిశ, నేషనల్ బ్యూరో:

ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు మాటల తూటాలతో దాడులు చేసుకుంటున్నాయి. ఈ సారి ఎన్నికల పోరు బీజేపీ, ఆప్ మధ్యనే ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనాల మేరకు.. కీలకమైన మూడు నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా ఆప్‌లో కీలక నాయకులైన అరవింద్ కేజ్రివాల్, మనీష్ సిసోడియా, ఆతిషిలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలను అందరూ నిశితంగా గమనిస్తున్నారు. వీరు ముగ్గురు వరుసగా న్యూఢిల్లీ, జంగ్‌పురా, కాల్కాజీ నుంచి బరిలో ఉన్నారు.

కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టిన కేజ్రివాల్

న్యూఢిల్లీ నియోజకవర్గం కొన్ని ఏళ్ల పాటు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. మాజీ సీఎం షీలా దీక్షిత్ ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు. అలాంటి నియోజకవర్గంలో ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ 2013లో తొలిసారి విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 2015, 2020లో కూడా విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పర్వేష్ శర్మ బరిలో ఉన్నారు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ శర్మ కుమారుడే పర్వేష్. ఇక కాంగ్రెస్ తరపున మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన ఈస్ట్ ఢిల్లీ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఇక్కడ బీజేపీ, ఆప్ మధ్యే ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉంది.

జంగ్‌పురాలో మనీష్ సిసోడియా..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని, తీహార్ జైలులో గడిపి వచ్చిన మనీష్ సిసోడియా.. ఈ సారి జంగ్‌పురా నుంచి పోటీ చేస్తున్నారు. 2013, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతాప్‌గంజ్ నుంచి పోటీ చేసి గెలిచిన మనీష్.. ఈ సారి జంగ్‌పురాలో తన లక్‌ను పరీక్షించుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తార్వీందర్ సింగ్ మార్వా ఈ సారి బీజేపీ తరపున బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఫర్హాద్ సూరి పోటీ చేస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లిక్కర్ స్కామ్ ద్వారా తన ఇమేజ్‌కు డామేజ్ చేసుకున్న మనీష్ సిసోడియా.. తొలి సారి జంగ్‌పురా బరిలో ఉండటం సాహసోపేతమైన నిర్ణయం అని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో రెండు సార్లు ఆప్ ఇక్కడి నుంచి గెలిచినా.. ఈ సారి మనీష్ సిసోడియా గట్టిగా కష్టపడాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.

అందరి చూపూ కాల్కాజీ వైపు..

ఢిల్లీలో అందరినీ ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం కాల్కాజీ. కేజ్రివాల్ జైలుకు వెళ్లిన తర్వాత ఢిల్లీకి సీఎం అయిన ఆతిషీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కేజ్రీవాల్‌కు వీర విధేయురాలిగా పేరున్న ఆతిషీ.. ఈ ఎన్నికల్లో గెలవడానికి గట్టిగా కష్టపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఆతిషికి బలమైన మద్దతు లభిస్తోంది. 2015లో ఆప్ తరపున అవ్‌తార్ సింగ్ గెలవగా, 2020లో ఆతిషి తొలి సారి పోటీ చేసి విజయం సాధించారు. ఇక బీజేపీ తరపున వివాదాస్పద నాయకుడు రమేష్ బిదూరి పోటీ చేస్తున్నారు. ఇటీవల ప్రియాంకా గాంధీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిలో పడ్డారు. కాగా, బీజేపీ సీఎం క్యాండిడేట్ రమేష్ బిదూరీనే అంటూ ఆతిషీతో పాటు కేజ్రివాల్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తరపున అల్కా లాంబా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచే రాజకీయం ప్రారంభించిన ఆల్కా.. ఆ తర్వాత కాలంలో ఆప్‌లో జాయిన్ అయ్యారు. 2015లో చాందినీ చౌక్ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే రాజీవ్ గాంధీకి ఇచ్చిన భారత రత్నను రద్దు చేయాలని ఆప్ తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ 2019 ఆమె పార్టీకి రాజీనామా చేసి.. తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడ కూడా త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story