Akhilesh: వాళ్లు మనుషుల గురించే మాట్లాడుతున్నారా.. పని గంటల చర్చపై అఖిలేష్ యాదవ్

by vinod kumar |
Akhilesh: వాళ్లు మనుషుల గురించే మాట్లాడుతున్నారా.. పని గంటల చర్చపై అఖిలేష్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని పలువురు పారిశ్రామిక వేత్తలు ఇటీవల తమ అభిప్రాయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh yadav) స్పందించారు. వారానికి 90 గంటలు పని చేయాలని సలహాలు ఇస్తున్న వారు మనుషుల గురించే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసే వారు 90 గంటల పాటు పని చేశారా అని ఫైర్ అయ్యారు. ‘మనుషులను రోబోలతో భర్తీ చేయడం గురించి మాట్లాడుతున్నారా? ఎందుకంటే మానవులు తమ భావోద్వేగాలతో, కుటుంబంతో జీవించాలనుకుంటున్నారు’ అని తెలిపారు. నిజమైన ఆర్థిక పురోగతి ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే గాక అందరికీ ప్రయోజనం చేకూర్చాలని తెలిపారు.

పని గంటల ప్రతిపాదనలను అఖిలేష్ తీవ్రంగా ఖండించారు. ఉత్పాదకత అంటే కేవలం అధిక గంటలు గడపడం మాత్రమే కాదని, హృదయపూర్వకంగా, సమర్ధవంతంగా పనిచేయడమని నొక్కి చెప్పారు. ‘పని నాణ్యత చాలా ముఖ్యం, పరిమాణం కాదు. అగ్రస్థానంలో కూర్చున్న వ్యక్తులు ఏమీ చేయకుండానే యువత కష్టపడి పనిచేసిన దాని నుంచి గరిష్ట ప్రయోజనం పొందుతారు. అందుకే అలాంటి కొందరు 90 గంటలు పనిచేయడం వంటి ఆచరణాత్మకం కాని సలహా ఇస్తారు’ అని విమర్శించారు. ఉచిత సలహాలిచ్చే వారు వారానికి 90 గంటలు పని చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ఈ స్థాయిలో ఎందుకు ఉందని ప్రశ్నించారు.

కాగా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు యువ భారతీయులు జాతీయ ఉత్పాదకతను పెంచడానికి వారానికి 70 గంటలు పనిచేయాలని సూచించారు. అంతేగాక ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణ్యన్ వారానికి 90 గంటల పని వేళలను సమర్థించారు. దీంతో ఈ అంశంపై చర్చ జరుగుతుండగా అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story

Most Viewed