Ajit Pawar : మారుతున్న ‘మహా’ సమీకరణాలు.. శరద్ పవార్‌తో అజిత్ సన్నిహితుడి భేటీ

by Hajipasha |
Ajit Pawar : మారుతున్న ‘మహా’ సమీకరణాలు.. శరద్ పవార్‌తో అజిత్ సన్నిహితుడి భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఎన్‌సీపీ ఎమ్మెల్యే అతుల్ బెంకే శనివారం రోజు ఎన్‌సీపీ (ఎస్‌‌పీ) అధినేత శరద్ పవార్‌‌తో భేటీ అయ్యారు. పూణేలోని ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఎంపీ డాక్టర్ అమోల్ కోల్హే నివాసంలో శరద్ పవార్‌ను అతుల్ బెంకే కలిశారు. ఈ భేటీ అనంతరం అతుల్ బెంకే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎవరూ ఏమీ చెప్పలేరు. శరద్ పవార్, అజిత్ పవార్ కూడా రాబోయే ఎన్నికల్లో కలిసి రావచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంపై శరద్ పవార్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘‘నన్ను కలవడానికి చాలా మంది వస్తుంటారు. ఇందులో కొత్తేముంది ? అతుల్ బెంకే నా స్నేహితుడి (దివంగత ఎమ్మెల్యే వల్లభ్ బెంకే) కొడుకు. ఇందులో ఏదైనా రాజకీయం ఉంటే తగిన సమయంలో తెలుస్తుంది’’ అని తెలిపారు.

శరద్ పవార్‌ను ఎమ్మెల్యే అతుల్ బెంకే కలవడంపై ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్‌ను ప్రశ్నించగా.. ‘‘ఎవరైనా ఎవరినైనా కలవడానికి వెళితే మనం ఏం చేయగలం ? చాలా మంది ఎమ్మెల్యేలు నన్ను కూడా కలుస్తారు’’ అని చెప్పారు. అది రాజకీయ సమావేశం కాదని.. దాని గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం లేదని ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఎంపీ డాక్టర్ అమోల్ కోల్హే స్పష్టం చేశారు. అంతకుముందు రోజు (శుక్రవారం) ముంబైలో శరద్‌పవార్‌తో అజిత్‌పవార్ వర్గం కీలక నేత, రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ సమావేశమయ్యారు. అజిత్ పవార్ త్వరలోనే సొంతగూటికి వస్తారని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.అయితే అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ అగ్రనాయకత్వం మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తోంది.

Advertisement

Next Story

Most Viewed